
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీలోని పెద్ద రెడ్లు కేసీఆర్‌కు అమ్ముడు పోయారని ఆరోపించారు. అందుకే కొత్త తరానికి అవకాశం వచ్చిందని.. తాను పీసీసీ అధ్యక్షుడిని అయ్యానని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ రెండో స్థానంలో ఉందని చెప్పారు. తమకు 32 నుంచి 34 ఓటింగ్ శాతం ఉందని అన్నారు. మరో 5 శాతం ఓట్ల కోసం తమ పోరాటమని తెలిపారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతుంది. ఈ క్రమంలోనే సోమవారం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన సందర్భంగా రేవంత్ రెడ్డి ఈ కామెంట్స్ చేశారు.
ఇంకా.. కాంగ్రెస్ పార్టీలో త్వరలోనే భారీ చేరికలు ఉంటాయని రేవంత్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్‌లో ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) చేరిక అంశం పార్టీ అధిష్టానం పరిధిలో ఉందని చెప్పారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క యాత్ర కాంగ్రెస్ కార్యక్రమని.. తాను కూడా యాత్రలో పాల్గొంటానని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన కామెంట్స్ ప్రజాస్వామయ్యంలో సరైనవి కావని అభిప్రాయపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్‌లు కలిసి డ్రామాలు ఆడుతున్నాయని విమర్శించారు. తెలంగాణలో కూడా పశ్చిమ బెంగాల్ తరహా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. తాను రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేస్తానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.