రాహుల్ పప్పు కాదు.. నిప్పు, ఆయనను చూడాలంటేనే మోడీకి భయం : రేవంత్ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Mar 26, 2023, 9:40 PM IST
Highlights

రాహుల్‌ను పప్పు అన్న బీజేపీ నేతలకు ఆయన ఇప్పుడు నిప్పులా కనబడుతున్నాడని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అదానీ దోపిడీపై పార్లమెంట్‌లో మోడీని రాహుల్ కడిగేశారని.. ఆయనను చూడాలంటేనే మోడీకి భయం పట్టుకుందని సెటైర్లు వేశారు. 

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత నేపథ్యంలో బీజేపీపై మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. హైదరాబాద్ గాంధీ భవన్‌లో ఆదివారం జరిగిన దీక్షలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ అంటే బ్రిటీష్ జనతా పార్టీ అంటూ చురకలంటించారు. బ్రిటీషర్ల విధానాలనే ఆ పార్టీ అమలు చేస్తోందని.. అసలు సర్దార్ వల్లభభాయ్ పటేల్‌తో బీజేపీకి సంబంధం ఏంటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన కాంగ్రెస్ నేత అని, ఆర్ఎస్ఎస్‌ను నిషేధించింది పటేలే అని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. గాంధీ భవన్‌కి పునాది వేసింది కూడా ఆయనే అని తెలిపారు. ఈస్ట్ ఇండియా కంపెనీ మాదిరే.. అదానీ కంపెనీ కూడా సూరత్ నుంచే మొదలైందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈస్ట్ ఇండియా కంపెనీ లాగే అదానీ కంపెనీలతో బీజేపీ కూడా దేశ సంపదను కొల్లగొడుతోందని ఆయన ఆరోపించారు. రాహుల్ కర్ణాటకలో వ్యాఖ్యలు చేస్తే.. గుజరాత్‌లో కేసులు ఎలా వేస్తారని రేవంత్ రెడ్డి నిలదీశారు. 

అదానీ దోపిడీపై పార్లమెంట్‌లో మోడీని రాహుల్ కడిగేశారని.. ఆయనను చూడాలంటేనే మోడీకి భయం పట్టుకుందని సెటైర్లు వేశారు. అదానీ దొంగతనం చేశారంటే మోడీ ఎందుకు భయపడుతున్నాడని.. ఆయనపై ఈడీ విచారణ అడుగుతుంటే మోడీ ఎందుకు మౌనంగా వుంటున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కోర్టు రాహుల్ గాంధీకి 30 రోజులు గడువు ఇచ్చిందని.. కానీ ఆ మరుసటి రోజే రాహుల్‌పై అనర్హత వేటు వేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే.. ఒక ఇంజిన్ అదానీ అయితే, రెండో ఇంజిన్ మోడీ అంటూ సెటైర్లు వేశారు. అదానీ ఇంజిన్ రిపేరుకు వస్తే.. మోడీ ఇంజిన్ పాడైపోయిందన్నారు. రాహుల్‌ను పప్పు అన్న బీజేపీ నేతలకు ఆయన ఇప్పుడు నిప్పులా కనబడుతున్నాడని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 

click me!