కేసీఆర్ పది వేలు ఇస్తున్నారు.. నువ్వో 10 వేలు తీసుకురా , రైతులకు ఇద్దాం : బండి సంజయ్‌కి హరీశ్ రావు సవాల్

By Siva KodatiFirst Published Mar 26, 2023, 8:18 PM IST
Highlights

కేసీఆర్ పదివేలు ఇస్తున్నారని.. కేంద్రం నుంచి బండి సంజయ్ మరో పదివేలు తీసుకొస్తే రైతుకు ఇద్దామన్నారు తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీశ్ రావు. కేసీఆర్ ప్రతి గింజా కొంటారని మంత్రి స్పష్టం చేశారు.
 

బీజేపీ నేతలపై మండిపడ్డారు తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీశ్ రావు. ఆదివారం సిద్ధిపేటలోని తన క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్, సుకన్య సమృద్ధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పది వేలు సరిపోతాయా అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ పదివేలు ఇస్తున్నారని.. కేంద్రం నుంచి బండి సంజయ్ మరో పదివేలు తీసుకొస్తే రైతుకు ఇద్దామన్నారు. కాళేశ్వరం నీళ్లతో పంటలు బాగా పండుతున్నాయన్నారు. తెలంగాణ తరహా పాలన కావాలని.. సంక్షేమ పథకాలు కావాలని ధర్నాలు, ఆందోళనలు జరుగుతున్నాయని హరీశ్ రావు వెల్లడించారు. కేసీఆర్ ప్రతి గింజా కొంటారని మంత్రి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రమాదవశాత్తూ చనిపోతే ఇన్సూరెన్స్ కింద ఇప్పటి వరకు 44  మందికి 90 లక్షల రూపాయలు సహాయం అందించినట్లు వెల్లడించారు. 38 మంది రైతులకు అసైన్డ్ భూమి పట్టాలు పంపిణీ చేస్తున్నామని హరీశ్ రావు పేర్కొన్నారు. 

అంతకుముందు మహారాష్ట్ర లోకల్‌ బాడీ ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ .   ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా లోహాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. దేవేంద్ర ఫడ్నవీస్ హామీ ఇస్తే తాను మహారాష్ట్రకు రావడం మానేస్తానన్నారు. తెలంగాణ మోడల్‌లాగా రైతుకు ప్రతి ఎకరాకు 10 వేలు ఇవ్వాలని.. తెలంగాణలో దళితుల కోసం దళిత బంధు పథకం తెచ్చామని కేసీఆర్ తెలిపారు. ఇది దేశంలోనే అద్బుతమైన పథకమని.. ఫడ్నవీస్ దళిత బంధు అమలు చేస్తే తాను మహారాష్ట్రకు రానని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్రలో మీకేం పని అని ఫడ్నవీస్ తనను ఉద్దేశించి అన్నారని.. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటినా ప్రజల బతుకులు మారలేదని దేవేంద్ర ఫడ్నవీస్ దుయ్యబట్టారు. 

Also REad: మహారాష్ట్ర ‘స్థానిక’ ఎన్నికల బరిలో బీఆర్ఎస్.. నాందేడ్ సభలో ప్రకటించిన కేసీఆర్

ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీలు రైతులకు ఏం చేశాయని ఆయన ప్రశ్నించారు. భారత పౌరుడిగా తాను ప్రతి రాష్ట్రానికి వెళ్తానని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ రెండు పార్టీల పాలనలో రైతుల పరిస్ధితి ఎందుకు మారలేదని ఆయన ప్రశ్నించారు. తాను చెప్పేది నిజమో, అబద్ధమో మీరే ఆలోచించాలని కేసీఆర్ ప్రజలను కోరారు. దేశంలో సరిపడా నీటి నిల్వలు వున్నా కనీసం తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నామని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో దేశంలో రైతు తుఫాన్ రాబోతోందని.. దాన్నెవరూ ఆపలేరని కేసీఆర్ పేర్కొన్నారు. ఎంతమంది పాలకులు మారినా తలరాతలు  మారడం లేదని ఎద్దేవా చేశారు. 

click me!