పాదయాత్రకు రేవంత్ రెడ్డి ప్లాన్:సకల జనుల సంఘర్షణ పేరుతో జనవరి నుండి యాత్ర

By narsimha lode  |  First Published Dec 18, 2022, 12:46 PM IST

వచ్చే ఏడాది జనవరి నుండి జనంలోకి వెళ్లాలని  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.  సకల జనుల సంఘర్షణ యాత్ర పేరుతో  పాదయాత్రకు రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. 


హైదరాబాద్: వచ్చే ఏడాది జనవరి చివరి వారం నుండి  తెలంగాణలో పాదయాత్ర చేసేందుకు టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి  ప్లాన్  చేసుకుంటున్నారు. సకల జనుల సంఘర్షణ యాత్ర పేరుతో రేవంత్ రెడ్డి పాదయాత్ర నిర్వహించాలని తలపెట్టారు. ఈ విషయమై ఇవాళ  పీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో చర్చించనున్నారు.

జనవరి నెల చివరి వారం నుండి  సుమారు  ఐదు మాసాల పాటు  రాష్ట్ర వ్యాప్తంగా  పాదయాత్ర చేయాలని  రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. వచ్చే ఏడాది చివర్లో  తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.  ఈ అసెంబ్లీ ఎన్నికలకు ముందే  పాదయాత్రను చేయాలని  రేవంత్ రెడ్డి రంగం సిద్దం చేసుకుంటున్నారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల గుండా  పాదయాత్ర  సాగేలా  రూట్ మ్యాప్ ను సిద్దం  చేసుకుంటున్నారు.చాలా కాలంగా రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయాలని భావిస్తున్నారు. అయితే  ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నందున  వచ్చే ఏడాది జనవరి మాసం నుండి పాదయాత్రను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. 

Latest Videos

వచ్చే ఏడాది  తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో తెలంగాణలో  అధికారంలోకి రావాలని  కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పట్టుదలగా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా సునీల్ కునుగోలు వ్యవహరిస్తున్నారు.  సునీల్  సూచనలు, సలహల మేరకు  కాంగ్రెస్ పార్టీ  నేతలు వ్యూహలు రచిస్తున్నారు. అయితే ఇదే సమయంలో  కాంగ్రెస్ పార్టీలో   కమిటీలు చిచ్చు రేపాయి.

తెలంగాణ రాష్ట్రంలో  ఎఐసీసీ ప్రకటించిన  పీసీసీ కమిటీలపై సీనియర్లు తిరుగుబాటు చేశారు. ఈ కమిటీల్లో  ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నేతలకు  కాకుండా  ఇతర పార్టీల నుండి వలసవచ్చిన  వారికి  చోటు కల్పించారని  సీనియర్లు  ఆరోపించారు.  నిన్న సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నివాసంలో సమావేశమైన  నేతలు  రేవంత్ రెడ్డి తీరుపై భగ్గుమన్నారు. 

ఇవాళ  జరగనున్న  టీపీసీసీ ఎగ్జిక్యూటివ్  కమిటీ సమావేశానికి   సీనియర్లు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. సీనియర్లు ఈ సమావేశానికి దూరంగా  ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ సమావేశం నిర్వహించాలా వద్దా  అనే విషయమై టీపీసీసీ నాయకత్వం తర్జన భర్జన పడింది.  ఈ సమావేశం నిర్వహించాలని ఎఐసీసీ నుండి సూచనలు అందడంతో  ఇవాళ సమావేశం నిర్వహించాలని  పీసీసీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది.ఈ సమావేశానికి రావాలని పార్టీ సీనియర్లకు ఆహ్వానం పంపింది. అయితే ఈ సమావేశానికి కాంగ్రెస్ సీనియర్లు  హాజరు కాబోమని ఇప్పటికే ప్రకటించారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్లను  న్యూఢిల్లీకి రావాలని పార్టీ నాయకత్వం ఆదేశించింది.  రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలపై  పార్టీ నాయకత్వం చర్చించనుంది. రేవంత్ రెడ్డి తీరును పార్టీ సీనియర్లు పార్టీ అధిష్టానానికి వివరించనున్నారు.

also read:టీ.కాంగ్రెస్‌లో ముసలం... సీనియర్లకు హైకమాండ్‌ నుంచి పిలుపు, ఢిల్లీలోనే తాడోపేడో

 రేవంత్ రెడ్డి  పాదయాత్రకు  ప్లాన్  చేసుకుంటున్న తరుణంలో  సీనియర్లు  తమ అసంతృప్తిని  బయట పెట్టారు. ఒరిజినల్ కాంగ్రెస్, వలసవాదుల కాంగ్రెస్ పేరుతో గ్యాప్ కొనసాగితే పాదయాత్రపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.పాదయాత్ర ప్రారంభమయ్యేలోపుగా  ఈ విషయమై  పార్టీ అధినాయకత్వం సర్దుబాటు చేయనుందని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు.

click me!