చిప్పకూడు తినిపించాడు.. కేసీఆర్‌తో కలుస్తానా : ఈటల ఆరోపణలపై కంటతడి పెట్టిన రేవంత్ రెడ్డి

By Siva KodatiFirst Published Apr 22, 2023, 7:08 PM IST
Highlights

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద కంటతడి పెట్టారు. తొమ్మిదేళ్లలో తనపై కక్షపూరితంగా కేసులు పెట్టించి, జైల్లో వుంచిన కేసీఆర్‌తో తాను ఎలా కలుస్తానని రేవంత్ ప్రశ్నించారు. చిప్పకూడు తింటే ఆ పరిస్ధితి తెలుస్తుందని రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

తనపై బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన ఆరోపణల నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శనివారం హైదరాబాద్ భాగ్యలక్ష్మీ టెంపుల్‌లో ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురై.. కంటతడి పెట్టారు. రేవంత్ రెడ్డి అంటే ఏంటో తెలంగాణ సమాజానికి తెలుసునన్నారు. తొమ్మిదేళ్లలో తనపై కక్షపూరితంగా కేసులు పెట్టించి, జైల్లో వుంచిన కేసీఆర్‌తో తాను ఎలా కలుస్తానని రేవంత్ ప్రశ్నించారు. చివరికి కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు ఇబ్బందులు పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

నోటీసులు రాగానే నీలాగా భయపడి లొంగిపోలేదని.. చిప్పకూడు తింటే ఆ పరిస్ధితి తెలుస్తుందని రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేశారని.. చర్లపల్లి, చంచల్‌గూడ జైళ్లలో కరడుగట్టిన ఉగ్రవాదుల్ని వుంచే డిటెన్షన్ సెల్‌లో పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో నిద్రలేని రాత్రులు గడిపానని గుర్తుచేశారు. కేసీఆర్‌పై విమర్శలు చేసే వారిపై ఈటల రాజేందర్ దాడి చేస్తున్నారని.. చిల్లర రాజకీయాలు సరికాదని రేవంత్ హితవు పలికారు. 

Latest Videos

Also Read: అమ్మవారి మీద ఒట్టు.. కేసీఆర్ నుంచి ఒక్క రూపాయి తీసుకున్నా నాశనమైపోతా : రేవంత్ రెడ్డి

అందరితో మాట్లాడినట్లుగా తనతో మాట్లాడొద్దని .. ఇప్పటి వరకు ఈటలపై తనకు కొంత అభిమానం వుండేదన్నారు. రాజేందర్ తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదని రేవంత్ స్పష్టం చేశారు. కేసీఆర్ సర్వం ధారపోసినా తనను కొనలేరని.. తన జీవితం వడ్డించిన విస్తరి అని, తనకు అన్నీ వున్నాయని కానీ తన ఏకైక లక్ష్యం కేసీఆర్‌ను గద్దె దించడమేనన్నారు. తన నిజాయితీని శంకిస్తే మంచిది కాదని.. రేవంత్ రెడ్డి కొనేవాడు ఇంకా పుట్టలేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ సమాజం ముందు ఈటల దోషిలా నిలబడే పరిస్ధితి రావొద్దన్నారు. తాను కేసీఆర్‌తో కొట్లాడుతున్నప్పుడు పక్కన సాక్షిగా వుంది ఈటలేనని రేవంత్ అన్నారు. 

నీ పార్టీలో గుర్తింపు కోసం దిగజారుడు ఆరోపణలు చేస్తావా.. కేసీఆర్ దగ్గర పాతిక కోట్లు తీసుకుని వుంటే ఆయన కళ్లలోకి ధైర్యంగా చూడగలిగేవాడినా అని రేవంత్ ప్రశ్నించారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా కొట్లాడటమంటే ఇదేనా అని ఆయన నిలదీశారు. మునుగోడు ఉపఎన్నిక కోసం బీజేపీ, బీఆర్ఎస్‌లు వందల కోట్లు ఖర్చు చేశాయని.. కానీ తమ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి మాత్రం పైసా ఖర్చు పెట్టలేదన్నారు. కేసీఆర్ దండుపాళ్యం ముఠాలు తన స్థైర్యాన్ని దెబ్బతీయాలని చూశాయన్నారు. కేసీఆర ముసుగు వేసుకుని ఈటల రాజకీయాలు చేస్తున్నారని.. ఈటలకు కన్నీటీ విలువ తెలియదని రేవంత్ తీవ్రవ్యాఖ్యలు చేశారు. 

click me!