
కర్ణాటక ప్రజల తీర్పును మనస్పూర్తిగా స్వాగతిస్తున్నామన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీని కర్ణాటక ప్రజలు తిరస్కరించారని అన్నారు. భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్‌లో జోష్ వచ్చిందని.. బీఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొన్న కుమారస్వామిని ప్రజలు తిరస్కరించారని రేవంత్ దుయ్యబట్టారు. కర్ణాటక ఫలితాలు తెలంగాణలో పునరావృతం కాబోతున్నాయని.. హిమాచల్‌లో తొలి విజయం, కర్ణాటకలో రెండో విజయం, తెలంగాణలో మూడో విజయం రాబోతోందని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. భారత్ జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ వరుస విజయాలు సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు. భారత్ జోడో.. నఫ్రత్ తోడో అని రాహుల్ పిలుపునిచ్చారని రేవంత్ తెలిపారు.
కేసీఆర్, మోడీ వేర్వేరు కాదని కర్ణాటక ఎన్నికలతో తేలిపోయిందన్నారు . మోడీని ఓడించాలని కేసీఆర్ అనుకుంటే.. మహారాష్ట్రలో మీటింగ్‌లు ఎందుకు పెడతారని రేవంత్ ప్రశ్నించారు. హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో 41 స్థానాలు వున్నాయని.. ఇక్కడ ఆయన లక్షమందితో భారీ సభ పెట్టి మోడీని ఓడించాలని పిలుపునివ్వొచ్చని రేవంత్ వ్యాఖ్యానించారు. అలా చేసుంటే కేసీఆర్‌పై ప్రజలకు కాస్తయినా నమ్మకం వుండేదన్నారు. ఇప్పటి వరకు కర్ణాటక ఎన్నికల్లో మోడీని ఓడించమని కేసీఆర్ ఎలాంటి ప్రకటనా చేయలేదన్నారు. కర్ణాటక ఫలితం తమకు వెయ్యి ఏనుగుల బలం లాంటిదన్నారు. దక్షిణ భారతదేశంలో బీజేపీకి స్థానం లేదని.. దక్షిణాదిలో ఉత్తర భారతదేశానికి చెందిన బీజేపీకి స్థానం లేదని రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ALso Read: కర్ణాటక ఎన్నికల ఫలితాలు: ఇండియా టుడే స్టూడియోలో ప్రదీప్ గుప్తా, రాజ్దీప్ డ్యాన్స్.. ! ఎందుకంటే.. ?
మోడీ ప్రభుత్వం కర్ణాటకలో, కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో 40 శాతం కమీషన్లు తీసుకుంటోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పార్టీని చీల్చి, ఫిరాయింపులను ప్రోత్సహించి కర్ణాటకలో అధికారాన్ని నిలబెట్టుకున్నారని.. తెలంగాణలోనూ విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను కేసీఆర్ తన పార్టీలోకి విలీనం చేసుకున్నారని రేవంత్ దుయ్యబట్టారు. దళితబంధులో 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నారో స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించారని ఆయన ఎద్దేవా చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు థాక్రే మాట్లాడుతూ.. బీజేపీని గెలిపించి, కాంగ్రెస్‌ను ఓడించాలని బీఆర్ఎస్ ప్రయత్నించిందని ఆరోపించారు. అలాగే కర్ణాటక ఫలితాలు తెలంగాణలో కూడా ప్రభావం చూపుతాయని అన్నారు నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. మతతత్వ బీజేపీని తెలంగాణ ప్రజలు కూడా తిరస్కరించబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. కర్ణాటకలో అవినీతి బీజేపీలాగే.. ఇక్కడ బీఆర్ఎస్ ఓటమి ఖాయమని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ వీ హనుమంతరావు మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్లే బీజేపీ ఓటమి పాలైందన్నారు. అటు ప్రజాస్వామ్య విలువల్ని కాపాడే పార్టీ కాంగ్రెస్సేనన్నారు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య. కర్ణాటక విజయం స్పూర్తితో తెలంగాణలోనూ దూసుకుపోతామన్నారు మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి.