
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కర్ణాటక ప్రజలను రంజింపజేయడంలో కేరళ స్టోరీ ఎలా విఫలమైందో.. అదే విధంగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపవని అన్నారు. అదే సయంలో నీచమైన, విభజన రాజకీయాలను తిరస్కరించినందుకు కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు చెబుతున్నట్టుగా కేటీఆర్ పేర్కొన్నారు. భారతదేశం గొప్ప మేలు కోసం పెట్టుబడులు, మౌలిక సదుపాయాలను సృష్టించడం కోసం హైదరాబాద్, బెంగళూరు సిటీలను ఆరోగ్యకరంగా పోటీ పడనివ్వండని అన్నారు.
ఇక, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేసింది. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ మార్క్‌ను అధిగమించి స్థానాలను సొంతం చేసుకుంది. కన్నడ ప్రజలు కూడా గత 38 ఏళ్లుగా కొనసాగుతున్న ఐదేళ్లకోకసారి అధికార మార్పిడి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. కాంగ్రెస్‌కు విజయం కట్టబెట్టారు. కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలు ఉండగా.. అధికారం దక్కించుకోవడానికి 113 సీట్లను కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే కాంగ్రెస్ ఇప్పటికే 135 స్థానాల్లో విజయం సాధించింది. మరొక స్థానంలో ముందంజలో కొనసాగుతుంది. ఇక, బీజేపీ 64 స్థానాల్లో విజయం సాధించింది. జేడీఎస్ 19 స్థానాల్లో విజయం సాధించగా.. ఒక్క స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతుంది.
ఈ ఫలితాలతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. న్యూఢిల్లీలోని ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్‌లో పార్టీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. అక్కడ స్వీట్స్ పంపిణీ చేశారు. మరోవైపు బెంగళూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని సంబరాలు జరుపుకుంటున్నారు. ఆఫీసు వద్ద బాణసంచా కాల్చుతున్నారు.