కరీంనగర్ నుంచి వలసొచ్చిన కేసీఆర్‌ను ఆదరిస్తే.. పాలమూరులో వలసలు ఆగాయా : రేవంత్ రెడ్డి

By Siva KodatiFirst Published May 25, 2023, 9:15 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. వలస వచ్చిన వ్యక్తిని మనం ఆదరిస్తే.. పాలమూరు వలస కార్మికులను కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని ఆయన ఎద్దేవా చేశారు.
 

కరీంనగర్ నుంచి వలస వచ్చిన కేసీఆర్‌ను పాలమూరు ప్రజలు ఆదరించి 2009లో పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించారని.. కానీ ఆయన ఈ ప్రాంతానికి ఏం చేశారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గురువారం జడ్చర్లలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన పీపుల్స్ మార్చ్ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరులో వలసలు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరును అభివృద్ధి చేస్తానన్న కేసీఆర్ ఆ హామీని మరిచిపోయారని దుయ్యబట్టారు.

2009లో కృష్ణా వరదలు వస్తే .. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో వున్న తన ఇంటిని అమ్మి ఆదుకుంటానని చెప్పారని రేవంత్ చురకలంటించారు. వలస వచ్చిన వ్యక్తిని మనం ఆదరిస్తే.. మన వలస కార్మికులను కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని ఆయన ఎద్దేవా చేశారు. 2006లో జడ్చర్లలో తనను ఇండిపెండెంట్‌గా గెలిపించి మొక్కను నాటారని.. ఇప్పుడు ఆ మొక్క వృక్షమైందని రేవంత్ తెలిపారు. రాష్ట్రంలో గజ్వేల్, సిద్ధిపేట, సిరిసిల్లకు మాత్రమే నీళ్లు, నిధులు వెళ్తాయని.. మరి మిగతా ప్రాంతాలకు ఎందుకు రావని ఆయన ప్రశ్నించారు. 

Also Read: గెలుపు గుర్రాలకే సీట్లు: సర్వే ఆధారంగానే టిక్కెట్లకు కాంగ్రెస్ ప్లాన్

అంతకుముందు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. బొగ్గుబావులను ప్రైవేట్ పరం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు . భూముల వివరాలు ధరణిలో కనిపించడం లేదంటూ భగ్గుమన్నారు. పాదయాత్రలో ఆదివాసీల కష్టాలను చూశానని.. ఇందుకోసమా తెలంగాణ తెచ్చుకుందని వారు ఆవేదన వ్యక్తం చేశారని భట్టి తెలిపారు. మంచిర్యాలలో నిరుద్యోగులు సమస్యలు చెప్పుకున్నారని.. ఆదిలాబాద్‌లో అడవి బిడ్డల ఆవేదనను విన్నానని భట్టి పేర్కొన్నారు. ఇక సింగరేణి కార్మికులది మరో సమస్య అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ వ్యక్తులకు సింగరేణిని అప్పగిస్తే తమ ఉద్యోగాలు పోతాయని కార్మికులు ఆందోళన చెందుతున్నారని భట్టి విక్రమార్క చెప్పారు. 

ఇబ్రహీంపట్నంలో పేదలకు ఇచ్చిన పది వేల ఎకరాల భూములను లాక్కున్నారని.. వాటిని బడా బాబులకు కట్టబెట్టారని విక్రమార్క ఆరోపించారు. అక్కడ ఒక్కో ఎకరం రూ.నాలుగు కోట్లు విలువ చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆ భూముల కోసం తిరగబడాలని.. కాంగ్రెస్ అండగా వుంటుందని భట్టి పిలుపునిచ్చారు. చాకల ఐలమ్మ స్పూర్తితో కొట్లాడాలని.. అవసరమైతే అరకలు కట్టిస్తామని భట్టి చెప్పారు. నాలుగైదు నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని విక్రమార్క పేర్కొన్నారు. లక్ష్మీదేవుపల్లి ప్రాజెక్ట్‌ను కుర్చీ వేసుకుని మరీ కట్టిస్తామని చెప్పారని అది ఎంత వరకు వచ్చిందని భట్టి ప్రశ్నించారు. 


 

click me!