హైదరాబాద్‌లో వరద సహాయక చర్యలు , దుర్భర పరిస్దితులపై ప్రభుత్వంపై మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రజలు కష్టాల్లో వుంటే.. వర్షాలు, వరదలపై కనీసం సమీక్ష కూడా చేయలేదని టీపీసీసీ చీఫ్ ఎద్దేవా చేశారు.
తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. గడిచిన కొద్దిరోజులుగా భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం అతలాకుతలంగా మారిందని, ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పట్టించుకోలేదని.. బర్త్ డే వేడుకల మోజులో వున్న తారక రామారావు ప్రజల గురించి ఏ మాత్రం పట్టించుకోలేదని రేవంత్ దుయ్యబట్టారు. ప్రజలు కష్టాల్లో వుంటే.. వర్షాలు, వరదలపై కనీసం సమీక్ష కూడా చేయలేదని టీపీసీసీ చీఫ్ ఎద్దేవా చేశారు.
ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించినప్పటికీ ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోలేదని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను ఒక డల్లాస్‌గా, ఓల్డ్ సిటీని ఒక ఇస్తాంబుల్‌గా చేస్తానని గొప్పలు చెప్పి.. చివరికి తండ్రీకొడుకులిద్దరూ కలిసి నగరాన్ని మురికికూపంగా మార్చారని ఆయన దుయ్యబట్టారు. బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో హైదరాబాదీలకు మేలు జరిగే ఒక్క పని కూడా చేపట్టలేదని రేవంత్ విమర్శించారు.
ALso Read: ఉచిత విద్యుత్ మా పేటెంట్ : కాంగ్రెస్ ఏం ఇచ్చిందా.. వైఎస్ సంతకం పెడుతున్న ఫోటోతో భట్టి సెల్ఫీ
మరోవైపు.. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వుండాలని ఆయన సూచించారు. నాలాలు, వరద ప్రవాహం వున్న ప్రాంతాలకు, శిథిలావస్థలో వున్న ఇళ్లకు దూరంగా వుండాలని పేర్కొన్నారు. పిల్లలను బయటకు పంపించవద్దని రేవంత్ తల్లిదండ్రులకు సూచించారు. ప్రజలకు అందుబాటులో వుండి సహాయ సహాకారాలను అందించాలని కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.