హైద్రాబాద్ బీజేపీ కార్యాలయంలో ఎంపీ అరవింద్ కు వ్యతిరేకంగా నిరసన: మండల పార్టీ అధ్యక్షుల మార్పుపై ఆందోళన

By narsimha lode  |  First Published Jul 26, 2023, 2:00 PM IST

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని  పలు  మండలాల పార్టీ అధ్యక్షులను మార్చడంపై   కొందరు బుధవారం నాడు  హైద్రాబాద్ బీజేపీ కార్యాలయంలో ఆందోళనకు దిగారు.


హైదరాబాద్:  ఉమ్మడి నిజామాబాద్  జిల్లాలోని  బీజేపీ కార్యకర్తలు  బుధవారం నాడు ఆందోళన నిర్వహించారు. ఏకపక్షంగా  మండల పార్టీ అధ్యక్షులను మార్చారని ఆరోపిస్తూ  బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో  ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు  చెందిన   కార్యకర్తలు ఆందోళనకు దిగారు. 

జిల్లాలోని ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు  ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 13 మండలాల పార్టీ అధ్యక్షులను మార్చివేశారని ఆందోళనకారులు  గుర్తు  చేశారు.. ఏకపక్షంగా మండల పార్టీ అధ్యక్షుల మార్పు జరిగిందని   నిరసనకారులు  చెబుతున్నారు.  ఈ విషయమై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు  కిషన్ రెడ్డి  జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.

Latest Videos

నిజామాబాద్ ఎంపీ  అరవింద్ కుమార్ ఏకపక్షంగా  మండల అధ్యక్షులను మార్చారని  నిరసనకారులు ఆరోపణలు  చేస్తున్నారు.బీజేపీ తెలంగాణ కార్యాలయం ఇంచార్జీ ప్రకాష్  ఆందోళన చేస్తున్న వారిని కార్యాలయం నుండి బయటకు వెళ్లాలని కోరారు.  బీజేపీ కార్యాలయ కార్యదర్శితో  నిరసనకారులు ఆందోళనకు దిగారు.ఈ విషయం తెలుసుకున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నిరసనకారులను  పిలిపించారు.   నిరసనకారులతో  కిషన్ రెడ్డి  చర్చిస్తున్నారు.2018 ఎన్నికల్లో ఆర్మూర్ నుండి వినయ్ రెడ్డి, బాల్కొండ నుండి వీఆర్ వెంకటేశ్వరరావు  పోటీ చేశారు.

ఆర్మూర్ నియోజకవర్గంలో  రాకేష్ రెడ్డి  బీజేపీలో  చేరారు.  రాకేష్ రెడ్డి బీజేపీలో  చేరడం వెనుక  అరవింద్ కీలకంగా వ్యవహరించారు. మరో వైపు బాల్కోండ అసెంబ్లీ నియోజకవర్గంలో  మల్లికార్జున్ రెడ్డి  బీజేపీలో చేరారు. ఈ రెండు  నియోజకవర్గాల్లో  గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు తెలియకుండా ఇద్దరు నేతలు  పార్టీలో చేరారు.ఈ విషయమై  ఈ ఇద్దరు నేతలు అరవింద్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కొత్త నేతలను ఎంపీ అరవింద్ ప్రోత్సహించడంపై  వారు  అసంతృప్తితో ఉన్నారు. 

బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిని మార్చాలని గతంలో అరవింద్ డిమాండ్  చేశారు. అయితే  ఈ ప్రతిపాదనను  అప్పటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పక్కన పెట్టారు. కిషన్ రెడ్డి  రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక  13 మండలాల పార్టీ అధ్యక్షులను మార్చడంతో అరవింద్ వ్యతిరేక వర్గం ఇవాళ  బీజేపీ కార్యాలయంలో నిరసనకు దిగింది.


 

click me!