టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేసే విషయమై గవర్నర్ స్పందించడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్: తనకున్న విశేష, విచక్షణ అధికారాలను ఉపయోగించి టీఎస్‌పీఎస్‌సీ రద్దు చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారంనాడు హైద్రాబాద్ గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. టీఎస్‌పీఎస్‌సీ పాలకవర్గాన్ని రద్దు చేసే అధికారం గవర్నర్ కు ఉందని ఆయన గుర్తు చేశారు.టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో మంత్రి కేటీఆర్ ను భర్తరఫ్ చేయాలని తాము డిమాండ్ చేసినట్టుగా ఆయన గుర్తు చేశారు.
కేటీఆర్ ను భర్తరఫ్ చేయకపోతే ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతివ్వాలని కూడా గవర్నర్ ను కోరిన విషయాన్నిఆయన ప్రస్తావించారు. కానీ ఈ విషయమై గవర్నర్ నుంండి స్పందన లేదని రేవంత్ రెడ్డి చెప్పారు. తాము ఫిర్యాదు చేయడంతో ఈడీ రంగంలోకి దిగిందని రేవంత్ రెడ్డి చెప్పారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో చిన్న ఉద్యోగులను విచారించి సిట్ చేతులు దులుపుకుంటుందని రేవంత్ రెడ్డి విమర్శించారు.
నిరుద్యోగులను కేసీఆర్, మోడీలు మోసం చేశారన్నారు. . ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ఆయన మోడీని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం ఏమైందో చెప్పాలని ఆయన కసీఆర్ ను అడిగారు. టెన్త్ క్లాస్ హిందీ పేపర్ లీక్ కేసులో జైలుకు వెళ్లిన బండి సంజయ్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారట అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. పేపర్ లీక్ కేసులో జైలుకు వెళ్లి అత్తారింటి నుండి వచ్చినట్టుగా బండి సంజయ్ వచ్చారన్నారు. ఈ ఘటనే బీజేపీ, బీఆర్ఎస్ మధ్య సంబంధాలను బట్టబయలు చేస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు.
మే మొదటివారంలో నిర్వహించే నిరుద్యోగ సభలో ప్రియాంక గాంధీ పాల్గొంటారని ఆయన చెప్పారు. ఈ నెల 21న ఈ నెల 24నఖమ్మం, ఈ నెల 26న ఆదిలాబాద్ లో నిరుద్యోగ సభలను నిర్వహించనున్నట్టుగా రేవంత్ రెడ్డి చెప్పారు. మే 9వ తేదీ నుండి రెండో విడత పాదయాత్రను నిర్వహించనున్నట్టుగా రేవంత్ రెడ్డి తెలిపారు.