సీనియర్లకు స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది: హుజూరాబాద్ ఫలితంపై రేవంత్ రెడ్డి

By Siva KodatiFirst Published Nov 2, 2021, 5:47 PM IST
Highlights

సీనియర్ నాయకులు స్వేచ్ఛగా స్పందించేందుకు హక్కు ఉంటుందని.. పరిస్ధితులు, నిబంధనలు పార్టీ అధ్యక్షుడిగా తనకు వుంటాయని రేవంత్ (revanth reddy) తెలిపారు. సీనియర్లు ఇచ్చిన సూచనలను పరిగణనలోనికి తీసుకుంటామన్నారు. 

సీనియర్ నాయకులు స్వేచ్ఛగా స్పందించేందుకు హక్కు ఉంటుందని.. పరిస్ధితులు, నిబంధనలు పార్టీ అధ్యక్షుడిగా తనకు వుంటాయని రేవంత్ (revanth reddy) తెలిపారు. సీనియర్లు ఇచ్చిన సూచనలను పరిగణనలోనికి తీసుకుంటామన్నారు. హుజురాబాద్ ఉపఎన్నిక (huzurabad by poll) ఫలితంపై రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆలస్యంగా ప్రకటించినా వెంకట్ బల్మూరి (venkat balmoor) గ్రామ గ్రామం తిరిగి .. ప్రతి తలుపును, ప్రతి గుండెను తట్టడం ద్వారా అందరికి చేరువయ్యారని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.  ఎన్నికలో ఓడిపోయినా వెంకట్ నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు. తప్పకుండా పార్టీకి , ఈ రాష్ట్రానికి భవిష్యత్తులో అతను నాయకుడు అవుతాడని రేవంత్ ఆకాంక్షించారు. తక్కువ సమయంలో ఎక్కువగా ప్రజల దగ్గర చేరుకుని.. పార్టీ బలాన్ని వినిపించి ప్రజల తరపున, ప్రజా సమస్యల గురించి స్పందించడంలో వెంకట్ ముందున్నాడని రేవంత్ ప్రశంసించారు. 

బల్మూర్ వెంకట్ భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి నాయకుడు అవుతాడని చెప్పారు. ఎన్నికల్లో ఓడిపోయినా రేపటి నుంచి హుజురాబాద్ ప్రజలకు అందుబాటులో వుండి .. ప్రజా సమస్యలపై , విద్యార్ధుల సమస్యలపై కోట్లాడతాడని ఆయన  తెలిపారు. గెలిస్తే ఉప్పొంగేది లేదని.. ఓడిపోతే కృంగిపోయేది లేదని రేవంత్ స్పష్టం చేశారు. హుజురాబాద్ ఎన్నికల ఫలితాలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సంపూర్ణమైన బాధ్యత తనదేనని రేవంత్ ప్రకటించారు. భవిష్యత్తులో ఇంకా నిబద్ధతతో, పట్టుదలతో పనిచేస్తానని ఆయన తెలిపారు. ఎన్నికల ఫలితాలపై పూర్తి స్థాయిలో సమాచారం తెప్పించుకుని.. విశ్లేషించి కాంగ్రెస్ కార్యాచరణను నిర్దారిస్తామన్నారు. 

Also Read:Huzurabad bypoll result 2021: సీనియర్ల అస్త్రం ఇదే, రేవంత్ రెడ్డికి చిక్కులు

రాబోయే 20 సంవత్సరాలు ప్రజల పక్షాన కోట్లాడే ఓపిక, వయసు రెండూ తనకు వున్నాయని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈనాడు కష్టపడ్డ కార్యకర్తలకు ఫలితాలు రాకపోయినా భవిష్యత్తులో వారిని నూటికి నూరు శాతం కాపాడుకుంటానని ఆయన తెలిపారు. ఏ కార్యకర్త కూడా నిరాశకు లోను కావాల్సిన అవసరం లేదని రేవంత్ స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ భవిష్యత్‌ను నిర్ధారించలేవని రేవంత్ అన్నారు. ఈ ఉపఎన్నికలు ప్రత్యేకమైన పరిస్ధితుల్లో జరిగాయని.. తెలంగాణ సమాజం మొత్తం గమనించిందని ఆయన చెప్పారు. రాజ్యంలో యుద్ధం జరిగినప్పుడు గెలిచిన రాజు రాజ్యాన్ని పాలిస్తాడని.. ఓడినవాళ్లు బందీలై, బానిసలుగా బ్రతుకుతారని, కానీ ఇది రాజ్యం కాదని రేవంత్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటమి గెలుపునకు పునాది వేయొచ్చన్నారు. 

2018 శాసనసభ ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి (bjp) 1673 ఓట్లు మాత్రమే వచ్చాయని.. కానీ ఈ రోజు ఉపఎన్నికల్లో ఆ పార్టీ నెగ్గిందని రేవంత్ గుర్తుచేశారు. ఇదే సమయంలో మొన్న జరిగిన నాగార్జున సాగర్ (nagarjuna sagar bypoll) ఉపఎన్నికల్లో బీజేపీ డిపాజిట్లు కోల్పోయిందని అంత మాత్రన ఆ పార్టీ మూసుకు పోయింది లేదన్నారు. అందువల్ల కార్యకర్తలు ఎవరూ నిరాశకు లోనవ్వాల్సిన అవసరం లేదని రేవంత్ అన్నారు. ఈ ఓటమి తనలో కసిని పెంచుతుందని.. కార్యకర్తలకు తాను అండగా వుంటానని ఆయన తెలిపారు. తెలంగాణకు పట్టిన గులాబీ చీడను వదిలించే వరకు పోరాటం వుంటుందని .. రేపటి నుంచే యథావిధిగా కార్యక్రమాలు ఉంటాయని రేవంత్ అన్నారు. 

click me!