Today Top 10 Telugu Lastest News 20 December 2023: శుభోదయం..ఈ రోజు టాప్ 10 సోర్టీలో భారత్ లో కరోనా కొత్త వేరియంట్ కలకలం..తెలంగాణలో అలర్ట్, న్యూఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు, నేటి నుంచి శాసనసభ సమావేశాలు.. పవర్ పాయింట్ ప్రజంటేషన్‌కు ప్రభుత్వం సిద్ధం, బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కు పోలీసుల నోటీసులు పలు అంశాల సమ్మిళితం.
Today Top 10 Telugu Lastest News:
తెలంగాణలో కరోనా కలకలం
కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి మరోసారి ఆందోళన రేపుతోంది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరగడం, కేరళ రాష్ట్రంలో కొత్త వేరియంట్ వెలుగుచూసిన క్రమంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కూడా కరోనా కొత్త వేరియంట్ కేసులపై అప్రమత్తమైంది. ఈ తరుణంలో తెలంగాణలో కూడా కరోనా కేసులు వెలువడ్డాయి. గడిచిన 24 గంటల్లో పలువురిని పరీక్షించగా. JN-1 లక్షణాలతో ఉన్న నాలుగు కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. తెలంగాణలో మొత్తం 9 మందికి ఐసోలేషన్ చేసి చికిత్స అందిస్తునట్టు వైద్యశాఖ తెలిపింది.
నిరుదోగ్యులకు సీతక్క గుడ్ న్యూస్..
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ఉద్యోగాల భర్తీకి సిద్దమవుతోంది. ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ప్రక్షాళన చేపట్టిన ప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీల వివరాలను సేకరిస్తోంది. ఈ క్రమంలోనే స్త్రీ శిశు సంక్షేమ శాఖమంత్రి సీతక్క (ధనసరి అనసూయ) నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 14 వేల అగ్వన్వాడీ పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు సీతక్క ప్రకటించారు.
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. పవర్ పాయింట్ ప్రజంటేషన్‌కు రేవంత్ సర్కార్ సిద్ధం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటీ నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ వివిధ అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ (పీపీటీ) ఇవ్వాలని సిద్దమైంది. ప్రభుత్వ నిర్ణయాన్ని దీటుగా తాము కూడా ప్రజంటేషన్ సన్నద్ధమవుతున్నమని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పేర్కొంది. ఈ నేపథ్యంలో సభలో మరోసారి చర్చలు వాడీవేడిగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ సందర్భంలోనే అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడి చర్చలు జరిగాయి. తాజాగా మూడు రోజుల విరామం అనంతరం సభ బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. ఈ రోజు సమావేశంలో ‘తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు- శ్వేత పత్రం’పై చర్చ సాగనున్నది. ఈ మేరకు రాష్ట్ర శాసనసభ కార్యదర్శి డాక్టర్ వి.నరసింహాచార్యులు మంగళవారం ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్రంలోని 14 మంది ఐఏఎస్‌లకు ప్రమోషన్లు
Telangana IAS Officers: తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే భారీగా ఐఏఎస్, ఐపీఎస్ లను బదిలీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా 20 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన కొంత సమయానికే ఐఏఎస్ లకు ప్రమోషన్ ఇస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. 2015 బ్యాచ్‌కు చెందిన 14 మంది ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ స్కేల్ ఐఏఎస్‌లుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరి పదోన్నతి 2024 జనవరి 1 నుంచి అమల్లోకి రానుందని ఉత్తర్వులలో పేర్కొన్నారు.
అదే సమయంలో కొందరు అదే పదవిలో కొనసాగనుండగా.. మరికొందరు ఐఏఎస్ లు కొత్త పోస్టులలో విధులు నిర్వహించనున్నారు. పదోన్నతి పొందిన వారు వీరే.. పమేలా సత్పతి, అనురాగ్ జయంతి, గౌతమ్ పాత్రు, రాహుల్ రాజ్, భావేష్ మిశ్రా, సత్య శారదాదేవి, నారాయణ రెడ్డి, ఎస్. హరీష్, జి. రవి, కె. నిఖిల, అయేషా మష్రత్ ఖానమ్, సంగీత సత్యనారాయణ, యాసీన్ బాషా, వెంకట్రావ్ ఉన్నారు.
బిగ్‌బాస్ విన్నర్ పల్లవి కేసు...
Bigg Boss 7: బిగ్‌బాస్ 7 ఫినాలే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్‌లో కొందరు రోడ్డుపై నానా హంగామా చేశారు. ఇతర బిగ్ బాస్ కంటెస్టెంట్ల కార్లపై దాడికి దిగారు. ఈ క్రమంలో అమర్‌దీప్, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ రోడ్డుపై తీవ్రంగా కొట్టుకున్నారు. ఈ తరుణంలో అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సులను కూడా ధ్వంసం చేశారు. ఈ దాడులను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్‌గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు అల్లర్ల వెనుక పల్లవి ప్రశాంత్ అభిమానుల ప్రమేయం ఉందని గుర్తించారు.
ఈ మేరకు పల్లవి ప్రశాంత్, అతని అభిమానులపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ-1గా పల్లవి ప్రశాంత్, ఏ-2గా అతని తమ్ముడు మనోహర్, ఏ-3గా మరో స్నేహితుడి పేరును నమోదు చేశారు. తాజాగా ఇద్దరు డ్రైవర్లను అరెస్టు చేశారు. విధ్వంసానికి సంబంధించిన వీడియోలు, సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా మరికొంతమంది ఆకతాయిలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గ్యారెంటీల అమలుకు 100 రోజులే గడువు- గంగుల కమలాకర్
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు 100 రోజుల పాటు ఎదురు చూస్తామని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. వ్యవసాయం దండగ అనే పరిస్థితి నుంచి, వ్యవసాయం పండగ అనే పరిస్థితికి తమ ప్రభుత్వం తీసుకొచ్చిందని అన్నారు. ప్రభుత్వం ప్రజల పక్షం ఉండాలని తెలిపారు. జవాబుదారీగా పని చేయాలని కోరారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే తప్పకుండా పోరాడుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలో డిసెంబర్ 9వ తేదీనే రైతులకు రైతు బంధు, రుణమాఫీ చేస్తామని చెప్పిందని గుర్తు చేశారు. తన చివరి క్షణం వరకూ ప్రజల కోసమే పని చేస్తానని హామీ ఇచ్చారు. 15 ఏళ్ల కాలంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా కరీంనగర్ ను ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారు.
న్యూఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు.. అర్థరాత్రి ఒకటి దాటితే..
మరికొద్దిరోజుల్లో పాత సంవత్సరానికి ప్రపంచం వీడ్కోలు పలకనుంది. సరికొత్త ఆశలు, ఆశయాలతో 2024కు ప్రజలు స్వాగతం పలకనున్నారు. ఎప్పటిలాగే డిసెంబర్ 31 రాత్రి న్యూఇయర్ సెలబ్రేషన్స్ చేసుకునేందుకు కుర్రకారు రెడీ అవుతున్నారు. కానీ, న్యూఇయర్ వేడుకలపై హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. రాత్రి 1 గంటలోపే వేడుకలు ముగించాలని సూచించారు. ఈవెంట్ నిర్వాహకులు 10 రోజుల ముందుగానే అనుమతులు తీసుకోవాలని, ప్రతి ఈవెంట్‌లోనూ సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వేదికలపై అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేయరాదని, 45 డెసిబుల్స్‌కు మించి శబ్ధం రాకుండా చూడాలని ఆదేశించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుపడితే 10 వేల జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష వుంటుందని హెచ్చరించారు. అవసరమైతే డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు చేస్తామని వెల్లడించారు.