తెలంగాణలో రేపు వ్యాక్సినేషన్‌కు సెలవు.. టీకాల కొరత వల్లేనా..?

By Siva KodatiFirst Published Apr 17, 2021, 9:46 PM IST
Highlights

తెలంగాణలో రేపు వ్యాక్సినేషన్‌కు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. సోమవారం మాత్రం యథావిధిగా వ్యాక్సినేషన్ కొనసాగుతుందని వెల్లడించింది. కాగా, తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ డోసులు ఇవాళ్టీతో ఖాళీ కానున్నాయి

తెలంగాణలో రేపు వ్యాక్సినేషన్‌కు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. సోమవారం మాత్రం యథావిధిగా వ్యాక్సినేషన్ కొనసాగుతుందని వెల్లడించింది. కాగా, తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ డోసులు ఇవాళ్టీతో ఖాళీ కానున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా రాష్ట్ర హెల్త్ డైరక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు.

ఈ కారణంతోనే ప్రభుత్వం రేపు వ్యాక్సినేషన్‌కు సెలవు ప్రకటించిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 28 డోసులు ఇచ్చినట్లు శ్రీనివాసరావు తెలియజేశారు.

హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్, 45 సంవత్సరాలు నిండినవారందరికీ వ్యాక్సినేషన్ పక్రియ కొనసాగుతోందని డీఎంహెచ్‌వో తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో.. ప్రజలందరూ వ్యాక్సిన్ తీసుకోవడానికి మొగ్గుచూపుతున్నారని ఆయన చెప్పారు. 

మరోవైపు ఫిబ్రవరి నుంచే కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయిందని..  కరోనా చికిత్సపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో మందులు, పడకలు, ఆక్సిజన్‌కు ఎలాంటి కొరత లేదని శ్రీనివాస్ స్పష్టం చేశారు.

ప్రైవేటు ఆస్పత్రుల్లో 5వేల ఆక్సిజన్‌ పడకలు, రాష్ట్రంలో 44 ప్రత్యేక కొవిడ్‌ ఆస్పత్రులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్యను పెంచామని.. రోజుకు లక్షకు పైగా పరీక్షలు చేస్తున్నామని ఆయన ప్రకటించారు.

Also Read:తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

ప్రస్తుతం రాష్ట్రంలో 38,600 పడకలు అందుబాటులో ఉన్నాయని.. రాబోయే రోజుల్లో వాటిని 53 వేలకు పెంచుతామని తెలిపారు. రాష్ట్రంలోని 116 ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్సలు అందిస్తున్నామని.. 15 నుంచి 20 కార్పొరేట్‌ ఆస్పత్రుల్లోనే పడకల కొరత ఉందని డీఎంహెచ్‌వో వెల్లడించారు.

80 శాతం కరోనా బాధితుల్లో లక్షణాలు ఉండటం లేదని....  గాలి ద్వారా వ్యాపించే దశకు కరోనా చేరిందని గతంలోనే ప్రజలకు తెలియజేశామని శ్రీనివాస్ గుర్తుచేశారు. గతంలో ఇంట్లో ఒకరిని ఐసోలేట్‌ చేస్తే సరిపోయేది. ప్రస్తుతం బాధితుడిని గుర్తించేలోపే కుటుంబమంతా వైరస్‌బారిన పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మ్యుటేషన్స్‌, డబుల్‌ మ్యుటేషన్స్‌, వివిధ దేశాల నుంచి ప్రయాణికుల ద్వారా వచ్చిన రకాలు కూడా తెలంగాణలో సర్క్యులేట్‌ అవుతున్నాయని శ్రీనివాస్ చెప్పారు. కొత్త మ్యుటేషన్ల కారణంగా కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోందని... 15 రోజుల్లోనే పాజిటివ్‌ రేటు రెట్టింపు అయిందని ఆయన వివరించారు.

click me!