దేశంలో, రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉందన్నారు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా.శ్రీనివాస్. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత దేశంలో మొదటిసారిగా 2 లక్షల కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోందన్నారు
దేశంలో, రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉందన్నారు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా.శ్రీనివాస్. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత దేశంలో మొదటిసారిగా 2 లక్షల కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోందన్నారు.
రానున్న రోజుల్లో వైరస్ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని శ్రీనివాస్ వెల్లడించారు. ప్రజలు, ప్రభుత్వ సహకారంతో తొలి దశను అడ్డుకోగలిగామని.. కానీ సెకండ్ వేవ్‌లో మ్యూటేషన్ల కారణంగా తీవ్రత అధికంగా ఉందని ఆయన చెప్పారు.
అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన అగ్ర రాజ్యాలు సైతం కరోనా ముందు మోకరిల్లాయని.. వాటితో పోల్చితే వసతులు అంతంత మాత్రంగా వున్న భారతదేశంలో మరింత అప్రమత్తంగా వుండాల్సిన అవసరం వుందని శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఈ మధ్య పండుగ చేసుకునేందుకు మహారాష్ట్ర నుంచి తెలంగాణ సరిహద్దు జిల్లాకు 20 మంది వచ్చారని... వీరికి మనవాళ్లు మరో 30 మంది కలిసి ఉత్సవం జరిపారని ఆయన తెలిపారు. కొన్ని రోజుల తర్వాత వాళ్లలో కరోనా లక్షణాలు కనిపించడం మొదలైందని.. వాళ్లలో ఐదుగురు పరీక్షలు చేయించుకోగా.. అందరికీ కరోనా పాజిటివ్‌గా తేలిందని డీఎంహెచ్‌వో వెల్లడించారు.
ఈ ఐదుగురు ఎక్కడి నుంచి వచ్చారనే విషయాన్ని తెలుసుకుని ట్రేస్ చేసుకుంటూ వెళ్తే మొత్తంగా 34 మందికి పాజిటివ్‌గా తేలిందని పేర్కొన్నారు. ఇలా పూర్తి స్థాయిలో పరిశీలించగా.. కేవలం 12 రోజుల్లోనే చుట్టుపక్కల గ్రామాల్లోని 433 మందికి వైరస్ సోకిందని ఆయన చెప్పారు.
కేవలం 20 మందితో మొదలై నేడు వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని శ్రీనివాస్ వెల్లడించారు. తొలిదశ నుంచి ప్రజలు గుణపాఠాలు నేర్చుకోలేదని.. కొవిడ్ వెళ్లిపోయిందనే భ్రమలోనే ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.
మొదటి వేవ్ తర్వాత ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగిందని.. అదే సమయంలో వైరస్ కూడా మరింత బలం పుంజుకుని, మ్యుటేషన్లుగా ఏర్పడి మరింత ఉద్ధృతంగా దాడి చేస్తోందని శ్రీనివాస్ వెల్లడించారు.
ఫిబ్రవరి నుంచే కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయిందని.. కరోనా చికిత్సపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో మందులు, పడకలు, ఆక్సిజన్‌కు ఎలాంటి కొరత లేదని శ్రీనివాస్ స్పష్టం చేశారు.
ప్రైవేటు ఆస్పత్రుల్లో 5వేల ఆక్సిజన్ పడకలు, రాష్ట్రంలో 44 ప్రత్యేక కొవిడ్ ఆస్పత్రులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్యను పెంచామని.. రోజుకు లక్షకు పైగా పరీక్షలు చేస్తున్నామని ఆయన ప్రకటించారు.
Also Read:తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
ప్రస్తుతం రాష్ట్రంలో 38,600 పడకలు అందుబాటులో ఉన్నాయని.. రాబోయే రోజుల్లో వాటిని 53 వేలకు పెంచుతామని తెలిపారు. రాష్ట్రంలోని 116 ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్సలు అందిస్తున్నామని.. 15 నుంచి 20 కార్పొరేట్ ఆస్పత్రుల్లోనే పడకల కొరత ఉందని డీఎంహెచ్‌వో వెల్లడించారు.
80 శాతం కరోనా బాధితుల్లో లక్షణాలు ఉండటం లేదని.... గాలి ద్వారా వ్యాపించే దశకు కరోనా చేరిందని గతంలోనే ప్రజలకు తెలియజేశామని శ్రీనివాస్ గుర్తుచేశారు. గతంలో ఇంట్లో ఒకరిని ఐసోలేట్ చేస్తే సరిపోయేది. ప్రస్తుతం బాధితుడిని గుర్తించేలోపే కుటుంబమంతా వైరస్‌బారిన పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మ్యుటేషన్స్, డబుల్ మ్యుటేషన్స్, వివిధ దేశాల నుంచి ప్రయాణికుల ద్వారా వచ్చిన రకాలు కూడా తెలంగాణలో సర్క్యులేట్ అవుతున్నాయని శ్రీనివాస్ చెప్పారు. కొత్త మ్యుటేషన్ల కారణంగా కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోందని... 15 రోజుల్లోనే పాజిటివ్ రేటు రెట్టింపు అయిందని ఆయన వివరించారు.