తెలంగాణ బిజెపి దూకుడు... ఈటల సమక్షంలో బిజెపిలో చేరిన ప్రముఖ సినీనటుడు

By Arun Kumar PFirst Published Aug 14, 2022, 7:48 AM IST
Highlights

అటు అధికార టీఆర్ఎస్, ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల నుండి భారీగా నాయకుల చేరికను ఆహ్వానిస్తున్న బిజెపి సినీనటులను కూడా పార్టీలో చేర్చుకునేందుకు యత్నిస్తోంది. ఇలా తాజాగా ఎమ్మెల్యే ఈటల సమక్షంలో ప్రముఖ తెలుగు నటుడు బిజెపిలో చేరాడు. 

హైదరాబాద్ : తెలంగాణలో గెలుపే లక్ష్యంగా బిజెపి పక్కా రాజకీయ వ్యూహాలతో ముందకు వెళుతోంది. ఇందులో భాగంగా ముందు నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు ఇతర పార్టీలతో పాటు ప్రముఖలను పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ఇలా ఇప్పటికే అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీల నుండి చాలామంది నాయకులు బిజెపిలో చేరగా తాజాగా సినీనటుడొకరు కాషాయ కండువా కప్పుకున్నారు. తెలుగులో ఆచార్య, మహర్షి వంటి సినిమాల్లో నటించిన సంజయ్ రాయచూర బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సమక్షంలో బిజెపిలో చేరారు. 

కేంద్రంలో బిజెపి పాలన, నరేంద్ర మోదీ సమర్థవంతమైన నాయకత్వం నచ్చడంతోనే  విజన్ కలిగిన నాయకులు పార్టీలో చేరుతున్నారని ఈటల అన్నారు. ఇలా సంజయ్ కూడా బిజెపి వైపు ఆకర్షితుడై పార్టీలో చేరినట్లు తెలిపారు. ఆయన చేరికతో తెలంగాణ బిజెపి మరింత బలోపేతం అయినట్లు ఎమ్మెల్యే ఆటల రాజేందర్ తెలిపారు.

ఇదిలావుంటే అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు బిజెపిలో చేరుతున్నారు. ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి త్వరలోని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బిజెపిలో చేరనున్నారు. ఇక మరో అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకుడు దాసోజు శ్రవణ్ కూడా పార్టీని వీడి ఇప్పటికే బిజెపిలో చేరారు. 

Read More  Munugode ByPoll 2022 : కాంట్రాక్ట్‌లకు అమ్ముడుపోతే.. ఉపఎన్నికకు వెళ్లగలనా : పోస్టర్ల ఘటనపై రాజగోపాల్ రెడ్డి

ఇతర పార్టీల నాయకులను పార్టీలోకి ఆహ్వానించడం కోసమే ఈటల రాజేందర్ నేతృత్వంలో చేరికల కమిటీని బిజెపి అధినాయకత్వం ఏర్పాటు చేసింది. దీంతో ఆయన బిజెపిలోకి ఇతర పార్టీల నాయకులనే కాదు సినీ ప్రముఖుల చేరికలను ప్రోత్సహిస్తున్నారు. ఇలా సినీనటి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జయసుధతో బిజెపి టచ్ లో వున్నట్లు సమాచారం. ఆమె కూడా కొన్ని షరతులను బిజెపి ముందు వుంచినట్లు.... వాటికి అంగీకరిస్తే ఆ పార్టీలో చేరడానికి సిద్దంగా వున్నట్లు తెలుస్తోంది. 

జయసుధ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ నుండి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పనిచేసారు. కానీ వైఎస్సార్ మరణం తర్వాత ఆమె యాక్టివ్ రాజకీయాలకు దూరమయ్యారు. అయితే తాజాగా ఆమెను బిజెపిలో చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్ ను దెబ్బతీయడంతో పాటు సినీవర్గాల్లో కూడా పార్టీ పట్టుసాధించడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు. అందువల్లే జయసుధతో బిజెపి రాష్ట్ర నాయకత్వం మంతనాలు జరుపుతోంది.

ఇక కరాటే కళ్యాణి లాంటి సినీనటులు బిజెపిలో వున్నారు. ఇప్పుడు ఆమెకు సంజయ్ రాయచూర తోడయ్యారు. ఇక జయసుధ వంటి ప్రముఖ నటి కూడా బిజెపిలో చేరితే తెలుగు సినీ ఇండస్ట్రీతో పాటు అభిమానులకు ఆ పార్టీ మరింత చేరువ కానుంది. ఇదే ఊపులో మరికొందరు నాయకులు, సినీ నటులను బిజెపిలోకి ఆహ్వానించవచ్చిన బిజెపి భావిస్తోంది. 

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమయ్యింది. కాంగ్రెస్ నుండి బిజెపిలో చేరనున్న రాజగోపాల్ ఈ ఉపఎన్నికల్లో మరోసారి పోటీచేయనుండగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్ధుల ఎంపికకు కసరత్తు చేస్తున్నాయి. ఈ ఉపఎన్నికల్లో మరో గెలుపుతో పార్టీలో మరింత ఊపు వస్తుందని బిజెపి, సత్తా చాటి బిజెపిని దెబ్బతీయాలను టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు భావిస్తున్నాయి. దీంతో మునుగోడు ఉపఎన్నిక  రసవత్తరంగా మారనుంది. 

 

click me!