రాహుల్ గాంధీ మణిపూర్‌లో భారత్ జోడో న్యాయ్ యాత్రను ప్రారంభించారు. ఈ వారం రోజుల్లో వైఎస్ షర్మిలకు ఏపీపీఎస్సీ పగ్గాలు ఇచ్చే అవకాశం ఉన్నది. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో అద్దంకి దయాకర్, మహేశ్ కుమార్ గౌడ్‌ల పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలిసింది.
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారం భారత్ జోడో న్యాయ్ యాత్ర ఈశాన్య రాష్ట్రం మణిపూర్ నుంచి ప్రారంభించారు. ఈ యాత్ర 67 రోజులపాటు సాగి మహారాష్ట్రలో ముగుస్తుంది. 15 రాష్ట్రాల మీదుగా 100 లోక్ సభ స్థానాలను కలుపుతూ భారత్ జోడో న్యాయ్ యాత్ర సాగనుంది. ఈ యాత్రలో ఇండియా కూటమి మిత్రపక్షాలు కూడా పాలుపంచుకోనున్నాయి. రాహుల్ గాంధీ మణిపూర్‌లో ప్రారంభ సభలో మాట్లాడుతూ అధికార బీజేపీపై విరుచుకుపడ్డారు. పైకి రాముడి పేరు గానీ.. కడుపులో కత్తులు పెట్టుకుని ఉన్నారని ఆరోపించారు. విభజన, విద్వేషమే వారి అసలు ఎజెండా అని ఫైర్ అయ్యారు. మణిపూర్ అల్లర్లలో 180 మందికిపైగా మరణించినా ప్రధాని మోడీకి పరామర్శించే తీరిక లేదా? అని ప్రశ్నించారు. కానీ, లక్ష దీవుల్లో సముద్రంలో సాహసాలు చేసే తీరిక ఎలా దొరికిందని నిలదీశారు.
వారంలో షర్మిలకు పీసీసీ బాధ్యత
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలతోపాటు వైఎస్ షర్మిల కూడా భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాలుపంచుకోవడానికి మణిపూర్ వెళ్లారు. అక్కడ ఆమెకు అగ్రనేతలు కొన్ని కీలక సూచనలు చేసినట్టు తెలిసింది. సంక్రాంతి తర్వాత ఆమెకు ఏపీపీసీసీ బాధ్యతలు అప్పగించనున్నట్టు సమాచారం. అయితే, 17వ తేదీన లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్థుల స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముందే షర్మిల పీసీసీ పగ్గాలు తీసుకునే అవకాశం ఉన్నది.
Also Read: Viral: సిక్స్ కొట్టిన బాల్‌ను ఎత్తుకెళ్లిన ప్రేక్షకుడు.. ఆగిపోయిన మ్యాచ్.. వీడియో వైరల్
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా..
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నిక అభ్యర్థులను కాంగ్రెస్ సోమవారం ప్రకటించే అవకాశం ఉన్నది. ఈ కోటాలో ఇద్దరు అభ్యర్థులగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్‌లను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ సీట్లకు టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం, సియాసత్ న్యూస్ ఎడిటర్ ఆమెర్ అలీ ఖాన్‌ల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తున్నది. వీరితోపాటు ఎమ్మెల్సీ బరిలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు హర్కార వేణుగోపాల్, ఏఐసీసీ కార్యదర్శి జి చిన్నారెడ్డి, పటేల్ రమేశ్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌లూ ఉన్నట్టు సమాచారం.
కాంగ్రెస్ సర్కారును కూల్చే కుట్ర
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నట్టు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ సర్కారును కూల్చే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు, కాంగ్రెస్‌లోనే ఆయన కోవర్టులను పెట్టుకున్నట్టు చెప్పారు.
Also Read: Infosys: విప్రో వల్లే ఇన్ఫోసిస్ పుట్టింది.. ఉద్యోగం తిరస్కరించడంతో కంపెనీ ప్రారంభించా: నారాయణమూర్తి
మా ఎమ్మెల్యేలను టచ్ చేసేంత లేదు
తమ ప్రభుత్వానికి ఏమీ ఢోకా లేదని, తమ ఎమ్మెల్యేలను ముట్టుకునే ధైర్యం ఎవరికీ లేదని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నట్టు బీజేపీకి ఎలా తెలుసు? అని ప్రశ్నించారు. అంటే.. ఈ రెండు పార్టీలు ఒక్కటేనని మరోమారు వారు రుజువు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌లో కోవర్టులు ఉన్నారని చెప్పే బండి సంజయ్ ఏమైనా జ్యోతిష్యం నేర్చుకున్నాడా? అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్, బీజేపీ కలవబోతున్నాయి
లోక్ సభ ఎన్నికల్లు కాంగ్రెస్, బీజేపీలు రెండూ కలిసి పని చేయబోతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా బండి సంజయే చెబుతున్నారని కామెట్ చేశారు. ఆయన చెబుతున్న వివరాల ప్రకారమే బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కలుస్తుందని తెలుస్తున్నదని ఎక్స్ వేదికగా కేటీఆర్ కామెంట్ చేశారు.