విప్రో కంపెనీలో తనకు ఉద్యోగం రాకపోవడంతో.. కొత్త ఐటీ సంస్థ ప్రారంభించాలనే ఆలోచన వచ్చిందని నారాయణ మూర్తి తెలిపారు. ఆ ఆలోచనలతోనే మరో ఆరుగురు మిత్రులతో కలిసి ఇన్ఫోసిస్ ఐటీ కంపెనీని ప్రారంభించినట్టు వివరించారు.
Azim Premji: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి, ఆయన సతీమణి సుధామూర్తి ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో కనిపిస్తున్నారు. వారు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చను లేవదీస్తున్నాయి. సుధామూర్తి కామెంట్‌తో వెజ్, నాన్ వెజ్ పై పెద్ద దుమారమే రేగగా.. 70 గంటల పని విధానం అవసరం అని నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తాజాగా, నారాయణమూర్తి మరో సంచలన విషయాన్ని వెల్లడించారు. ఇది వరకు ఎక్కడా చెప్పని ఓ గుట్టును విప్పారు. అసలు ఇన్ఫోసిస్ సంస్థ పుట్టుకకు విప్రో సంస్థనే కారణం అని చెప్పారు.
ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సంచలన విషయాలను వెల్లడించారు. తాను విప్రో సంస్థలో ఉద్యోగ నిమిత్తం వెళ్లారని, కానీ, ఆ సంస్థ అధికారులు ఆయనను తిరస్కరించారని చెప్పారు. దాంతో ఆయనే మరో ఆరుగురు మిత్రులతో కలిసి, భార్య సుధామూర్తి ఇచ్చిన డబ్బులతో కొత్త ఐటీ సంస్థను ప్రారంభించారని వివరించారు. ఆ ఐటీ సంస్థనే ఇన్ఫోసిస్ అని తెలిపారు. తనకు విప్రోలో ఉద్యోగం దొరకలేదనే ఆలోచనతోనే ఇన్ఫోసిస్ సంస్థకు బీజం పడిందని వివరించారు.
ఈ విషయంపై విప్రో సంస్థ అధినేత అజీమ్ ప్రేమ్‌జీ తనతో మాట్లాడిన విషయాలనూ నారాయణ మూర్తి గుర్తు చేసుకున్నారు. ఆ రోజు నారాయణకు ఉద్యోగం ఇవ్వకపోవడం అప్పటి విప్రో పెద్దలు చేసిన అతిపెద్ద తప్పుడు నిర్ణయాల్లో ఒకటి అని, ఒక వేళ నారాయణ మూర్తికి ఉద్యోగం ఇచ్చి ఉంటే విప్రో సంస్థ మరోలా ఉండేదని అజీమ్ ప్రేమ్ జీ తనతో చెప్పారని నారాయణ మూర్తి వివరించారు.