Today Top Stories: ప్రజాపాలనకు భారీ స్పందన.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే ఇక అంతే.. అంబటి రాయుడు పొలిటికల్

By Rajesh Karampoori  |  First Published Dec 29, 2023, 6:52 AM IST

Today Top Stories: శుభోదయం..ఈ రోజు టాప్ సోర్టీస్ లో ప్రజాపాలనకు భారీ స్పందన, తెలంగాణలో ఇంటర్ పరీక్షల టైంటేబుల్ విడుదల,   డ్రంక్ అండ్ డ్రైవ్‌కు రూ. 15 వేల ఫైన్, క్యాబ్స్ రైడ్ నిరాకరించినా జరిమానా, తెలంగాణ నేతలకు  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిశా నిర్ధేశం, అంబటి రాయుడు పొలిటికల్ ఎంట్రీ..  వంటి పలు వార్తల సమాహారం.   


Today Top Stories:

Praja Palana: ప్రజాపాలనకు భారీ స్పందన.. 

Latest Videos

undefined

Praja Palana: ఆరు హామీల అమలు కోసం దరఖాస్తుల స్వీకరణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి తొలిరోజు భారీ స్పందన లభించింది. గురువారం నాడు తెలంగాణ వ్యాప్తంగా 7.46 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7,46,414 దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 2,88,711 దరఖాస్తులు రాగా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)తోపాటు పట్టణ ప్రాంతాల్లో 4,57,703 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.

 
తెలంగాణ నేతలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిశా.. 

2024 పార్లమెంట్ ఎన్నికల్లో  అనుసరించాల్సిన వ్యూహంపై  తెలంగాణ నేతలకు  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిశా నిర్ధేశం చేశారు. గురువారంనాడు  మధ్యాహ్నం  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా  హైద్రాబాద్ కు వచ్చారు. హైద్రాబాద్ శంషాబాద్ లోని  ఓ హోటల్ లో  రాష్ట్రానికి చెందిన  భారతీయ జనతా పార్టీకి చెందిన ముఖ్య నేతలతో  అమిత్ షా భేటీ అయ్యారు.  2024 ఏప్రిల్ లో జరిగే పార్లమెంట్ ఎన్నికలపై  ముఖ్య నేతలతో  అమిత్ షా చర్చించారు. పార్టీకి చెందిన రాష్ట్ర నేతల కోల్డ్ వార్ పై  అమిత్ షా  కేంద్రీకరించారు.  పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం, పార్టీ సమావేశాల్లో  చర్చలను బయట పెట్టవద్దని  నేతలకు  అమిత్ షా సూచించారు.  రాష్ట్రంలోని బీజేపీకి చెందిన నాలుగు స్థానాలు మినహా ఇతర స్థానాల్లో పరిస్థితులపై  అమిత్ షా  ఆరా తీశారు.  రాష్ట్రంలో  పార్టీ పరిస్థితిని  కిషన్ రెడ్డి అమిత్ షా కు వివరించారు.  ఎంపీ ఎన్నికల్లో పోటీకి ఆసక్తిగా ఉన్న నేతలు, వారి బలాబలాలపై  కూడ అమిత్ షా చర్చించారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో  పార్టీ విజయం కోసం  నేతలు కలిసికట్టుగా  పని చేయాలని అమిత్ షా సూచించారు.

డ్రంక్  అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే.. ఇక అంతే.. 

మరో రెండు రోజుల్లో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకల్లో ముఖ్యంగా యువత పబ్బులు, క్లబ్బులు, దావత్‌ అంటూ ఇప్పటికే ప్లాన్లు చేసుకుని ఉంటారు. ఈ తరుణంలో తప్ప తాగి  రాత్రిపూట రోడ్లపై హల్ చల్ చేసే అవకాశాలూ లేకపోలేదు. ఇలా చేయడం వల్ల ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని నివారించడానికి హైదరాబాద్ పోలీసులు జరిమానాలతో హెచ్చరికలు చేస్తున్నారు. తాజాగా, న్యూ ఇయర్ వేడుకల సందర్భంలో హైదరాబాద్ పోలీసులు కీలక ప్రకటన చేశారు.  కొత్త సంవత్సరం సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వ్యక్తులకు రూ.15000 వరకు జరిమానా విధించాలని నిర్ణయించారు. తొలిసారి ఈ అఫెన్స్ చేసినవారికి రూ. 10,000 జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష కూడా పడొచ్చు. రెండో సారి ఈ నేరం చేసిన వారికి రూ. 15,000 ఫైన్, రెండేళ్ల వరకు జైలు శిక్ష పడొచ్చు. రాత్రి 8 గంటలు దాటిన తర్వాత డ్రంక్ డ్రైవర్ల పట్టివేతకు చెకింగ్‌లు పెంచుతామని సిటీ పోలీసులు వెల్లడించారు.
  
తెలంగాణలో ఇంటర్ పరీక్షల టైంటేబుల్ విడుదల

తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలయింది. ఫిబ్రవరి  28 నుండి మార్చి  19 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి  28 నుండి మార్చి  19 వరకు  ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.ఫిబ్రవరి 1 నుండి ఫిబ్రవరి 15 వరకు ఇంటర్ విద్యార్ధులకు ప్రాక్టీకల్స్ పరీక్షలు నిర్వహిస్తారు.ఫిబ్రవరి  28 నుండి మార్చి  18 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహిస్తారు.ఫిబ్రవరి 29 నుండి మార్చి  29 వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలను నిర్వహించనున్నారు.

తొలి టెస్టులో సఫారీల చేతిలో టీమిండియా ఘోర పరాజయం..

India Vs South Africa: దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ ఇది వరకు ఒక్క టెస్టు సిరీస్ కూడా గెలుచుకోలేకపోయింది. భారత్ టెస్టు సిరీస్ గెలుచుకోలేకపోయిన.. ఏకైక ఆతిథ్య దేశం దక్షిణాఫ్రికానే. ఈ సారికైనా భారత్ సిరీస్ కొట్టుకురావాలని క్రికెట్ అభిమానులు ఆశపడుతున్నారు. కానీ, తొలి టెస్టు మ్యాచ్‌లోనే భారత్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దక్షిణాఫ్రికా ఒకే ఇన్నింగ్స్‌లో చేసిన పరుగులను రెండు ఇన్నింగ్స్‌లోనూ టీమిండియా ఛేదించలేకపోయింది. సఫారీల చేతిలో ఒక ఇన్నింగ్, 32 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది. మూడు రోజులకే టెస్టు విజయాన్ని దక్షిణాఫ్రికాకు అప్పగించింది. ఈ టెస్టు దక్షిణాఫ్రికాలోని సెంచూరియన్‌లో జరిగింది.

అంబటి రాయుడు పొలిటికల్ ఎంట్రీ..  
 
మరికొద్దినెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు  వైసీపీలో చేరారు. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో రాయుడికి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అంబటి రాయుడు మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినట్లు తెలిపారు. తొలి నుంచి సీఎం జగన్‌పై తనకు మంచి అభిప్రాయం వుందని, కులమతాలు, రాజకీయాలతో పనిలేకుండా పారదర్శకంగా పాలన అందిస్తున్నారని రాయుడు ప్రశంసించారు. తన ప్రాంత ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తానని రాయుడు సపష్టం చేశారు. 

నటుడు విజయకాంత్ కన్నుమూత

చిత్ర సీమలో తీవ్ర విషాదం నెలకొంది. తమిళనాడు డీఎండీకే అధినేత, ప్రముఖ తమిళ నటుడు విజయకాంత్ (71) గురువారం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన చెన్నై మియోట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన రీసెంట్ గా కరోనా భారిన పడ్డారు. శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా ఉండడంతో ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందించక సాగారు. ఈ క్రమంలో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అటు ఆస్పత్రి వర్గాలు.. ఇటు తమిళనాడు ఆరోగ్య కార్యదర్శి విజయకాంత్‌ మృతిపై అధికారిక ప్రకటన చేశారు. 

click me!