
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ఇవాళ(ఆదివారం) దేశ రాజధాని న్యూడిల్లీ (new delhi) వెళ్లనున్నారు. భార్య శోభ, కూతురు కవితతో కలిసి బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో కేసీఆర్ డిల్లీకి వెళతారు. ఇటీవల భార్య వైద్యంకోసం డిల్లీకి వెళ్లడానికి సిద్దమవగా వివిధ కారణాలతో ఆ పర్యటన రద్దయ్యింది. ఈ నేపథ్యంలో ఇవాళ కేసీఆర్ భార్యను తీసుకుని డిల్లీకి వెళుతున్నారు. ప్రస్తుతం రాజస్థాన్ పర్యటనలో వున్న టీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ అక్కడినుండే నేరుగా డిల్లీకి చేరకుని కేసీఆర్ కుటుంబంతో కలవనున్నారు.
కేసీఆర్ సతీమణి శోభ పంటి నొప్పి సమస్యతో బాధపడుతున్నారు. ఆమెకు టెస్టులు చేయించి మెరుగైన చికిత్స అందించడానికి డిల్లీకి తీసుకువెళుతున్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ కూడా డిల్లీకి వెళుతున్నారు.
ఇక కేవలం భార్య వైద్యం కోసమే కాకుండా రాజకీయాల కోసం ఈ డిల్లీ పర్యటనను సీఎం కేసీఆర్ వాడుకోనున్నట్లు సమాచారం. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మద్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో కేంద్ర స్థాయిలో పోరాటినికి సిద్దమని ప్రకటించిన సీఎం కేసీఆర్ ఆ దిశగా ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు.
తెలంగాణ రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్రం అన్యాయంగా వ్యవహరిస్తోందంటూ ఇప్పటికే టీఆర్ఎస్ ఆందోళనల బాట పట్టింది. ఈ క్రమంలోనే రేపు(సోమవారం) రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది టీఆర్ఎస్. ఏప్రిల్ 11న టీఆర్ఎస్ శ్రేణులంతా దేశ రాజధాని డిల్లీలో ఆందోళన చేపట్టనున్నారు. రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, ప్రజాప్రతినిధులంతా ఈ నిరసనలో పాల్గొననున్నారు. ఈ నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయడం కోసం టీఆర్ఎస్ ముందస్తుగానే ఏర్పాటు చేసుకుంటోందని... వాటిపై కూడా సమాలోచనలు జరిపేందుకు సీఎం డిల్లీ పర్యటనకు వెళుతున్నట్లు తెలుస్తోంది.
ధాన్యం కొనుగోలుపై దేశంలోని వీలైనంత ఎక్కువమంది రైతుల మద్దతు, రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు సీఎం కేసీఆర్ డిల్లీ కేంద్రంగా పావులు కదపనున్నట్లు సమాచారం. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరిని ఎండగడుతూ బిజెపి వ్యతిరేక శక్తులను ఏకం చేయడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలువరు నేతల అపాయింట్ మెంట్ కూడా సీఎం కోరినట్లు సమాచారం. ఇలా కేంద్రంతో తాడో పేడో తేల్చుకోడాలని సిద్దమైన కేసీఆర్ డిల్లీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇదిలావుంటే ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర తీరును నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీ పోరాటాల బాట పట్టింది. రేపు(సోమవారం) మండల కేంద్రాల్లో నిరసన, ఈ నెల 6వ తేదీన జాతీయ రహదార్లపై రాస్తారోకో చేపట్టనున్నట్లు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. విజయవాడ, ముంబై, బెంగళూరు హైవేలపై రాస్తారోకో చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇక ఈ నెల 7న అన్ని జిల్లా కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, మంత్రుల ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపడతామని కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ నెల 8న ప్రతీ రైతు ఇంటిపై నల్ల జెండాలు ఎగురవేయాలని... ప్రతి గ్రామంలో కేంద్రం దిష్టిబొమ్మను తగులబెట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. ఇక ఈ నెల 11న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు చలో ఢిల్లీ కార్యక్రమానికి హాజరవుతారని కేటీఆర్ వెల్లడించారు. ఈ నెల 11న ఢిల్లీలో టీఆర్ఎస్ ముఖ్య నేతలంతా నిరసన తెలియజేస్తారని చెప్పారు. కేంద్రం వైఖరిని ఢిల్లీలో ఎండగడతామని కేటీఆర్ హెచ్చరించారు.