
హైదరాబాద్ నగరంలోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ (EFLU)లో ఓబీసీ కోటా విషయంలో అన్యాయం జరుగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. EFLU, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లలో జరుగుతున్న అన్యాయంపై ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ పోరాటం కొనసాగిస్తున్నారు. తొలుత ఓబీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని శ్రవణ్ National Commission for Backward Classes (ఎన్‌సీబీసీ) దృష్టికి తీసుకెళ్లారు. EFLU పై ఫిర్యాదు చేసిన శ్రవణ్.. OBCలకు రాజ్యాంగబద్ధంగా హామీ ఇచ్చిన 27 శాతం రిజర్వేషన్‌ను అమలు చేయకపోవడం, సిబ్బంది నియామకంలో పారదర్శకత లేకపోవడం, లాక్‌డౌన్ సమయంలో 58 ఫ్యాకల్టీ పోస్టులకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం, రిజర్వేషన్.. రోస్టర్ నియమాన్ని పాటించడం లేదని ఆరోపించారు.
EFLU ఫ్యాకల్టీ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించకుండా.. చాలా మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోకుండా చేసిందన్నారు. ఇలా చేయడం ద్వారా రాజ్యాంగానికి వ్యతిరేకంగా, రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడిందని ఆయన అన్నారు.
ఇఫ్లూ నోటిఫికేషన్ I/2020లో OBCల కోసం కేవలం ఎనిమిది పోస్ట్‌లను మాత్రమే ప్రకటించడం ద్వారా.. అడ్మినిస్ట్రేషన్ యొక్క సన్నిహితులు, బంధువులనే రిక్రూట్ చేశారని ఆరోపించారు. ఇఫ్లూలో యూజీసీ మంజూరు చేసిన 238 పోస్టులలో తప్పనిసరిగా 63 మంది ఓబీసీ ఫ్యాకల్టీ సభ్యులు ఉండాలన్నారు. యూనివర్సిటీలో కేవలం 25 మంది ఓబీసీలు మాత్రమే పనిచేస్తున్నారని.. యూనివర్సిటీ చరిత్రలో ఎన్నడూ ఓబీసీ అభ్యర్థులు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌లో ప్రొఫెసర్ లేదా అసోసియేట్ ప్రొఫెసర్‌గా ఎంపిక కాలేదని చెప్పారు.
ఓబీసీలకు మంజూరైన ఎనిమిది ప్రొఫెసర్ పోస్టులకు ఒక్క ప్రొఫెసర్‌ను కూడా ఎంపిక చేయలేదని, మంజూరైన 17 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు ఒక్క అభ్యర్థిని కూడా ఎంపిక చేయలేదని.. ఇది రిజర్వేషన్ విధానానికి తీవ్ర విఘాతం కలిగిస్తోందన్నారు. ఇందుకు సంబంధించి NCBCతో కలిసి శ్రవణ్ తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. అయితే తెలంగాణ హైకోర్టు నుంచి ఆర్డర్ పొందిన ఇఫ్లూ.. ప్రకటించిన 58 పోస్టులలో 25 పోస్టులను భర్తీ చేసింది.
అయితే ఇందుకు సంబంధించి శ్రవణ్.. సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్‌లో కూడి ద్విసభ్య ధర్మాసనం ఇఫ్లూకు నోటీసులు జారీ చేసింది. దీంతో శ్రవణ్ సుప్రీం కోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యాంగం కల్పించిన 27 శాతం రిజర్వేషన్‌ను కోల్పోయిన ఓబీసీలకు న్యాయం చేయడంలో ఇది ముందడుగు అని శ్రవణ్ అన్నారు.
అడ్మిషన్లు, ఉద్యోగాల్లో ఓబీసీలకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదని చెప్పారు. నేటికి కూడా ఓబీసీలను అనేక రకాలుగా అణచివేస్తున్నారని అన్నారు. చట్టసభల్లో ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే.. ఓబీసీలు న్యాయం కోసం అడుక్కునే పరిస్థితి ఉండదని చెప్పారు. చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ల కోసం ఓబీసీలు పోరాడాలని కోరారు.