తెలంగాణ బీజేపీ తొలి జాబితాను నేడు విడుదల చేయనుంది. ఈ జాబితాలో 65 స్థానాలకు చెందిన అభ్యర్థుల పేర్లు ఉండనున్నాయని సమాచారం.
ఢిల్లీ : ఎట్టకేలకు టీ బీజేపీ అభ్యర్థుల జాబితా ఈరోజు విడుదల కానుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక మీద బిజెపి కసరత్తు తుది దశకు చేరుకుంది. బిజెపి రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాష్ జవదేకర్ నివాసంలో గురువారం రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. అనేక దఫాలుగా సమావేశమై చర్చలు నిర్వహించారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కే లక్ష్మణ్.. పార్టీ రాష్ట్ర ఇంచార్జిలు సునీల్ బన్సల్, తరుణ్ ఛుగ్ లు పాల్గొన్నారు.
వీరితోపాటు జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బిజెపి ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో ముఖ్య నేతలు పోటీ చేసే నియోజకవర్గాలు, సామాజిక వర్గాల పరంగా సీట్ల కేటాయింపు, ఎక్కువ మంది టికెట్ ఆశిస్తున్న స్థానాలు…వీటిపై చర్చలు జరిగాయి. ఆ తర్వాత జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కోర్ కమిటీ సభ్యులు పలుమార్లు భేటీ అయ్యారు. ఈ సమావేశాల అనంతరం నడ్డా నివాసంలో గురువారం రాత్రి కోరు కమిటీ మరోసారి భేటీ అయింది.
ఎక్కిళ్లు ఎక్కువవ్వడంతో గుండెపోటు..ట్రాక్టర్ డ్రైవర్ మృతి...
ఈ సమావేశానికి అమిత్ షా కూడా హాజరయ్యారు. కోర్ కమిటీ ఇప్పటికే తెలంగాణలో పోటీ చేయాల్సిన అన్ని స్థానాల మీద ఓ అంచనాకు వచ్చింది. అయినా కూడా శుక్రవారం ఉదయం 11 గంటలకు మరోసారి నడ్డాతో సమావేశం కానున్నారు. ఆ తరువాతే తుది జాబితా సిద్ధమవుతోంది. ఆ తర్వాత శుక్రవారం సాయంత్రం జరిగే బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశానికి ఈ జాబితాను పంపుతారు. ఈ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ప్రధాని మోదీ, నడ్డా, అమిత్ షా, లక్ష్మణ్ లతో పాటు ఇతర సభ్యులు కూడా పాల్గొంటారు.
ఇక ఈ సమావేశంలోనే తెలంగాణకు చెందిన అభ్యర్థుల ఎంపికతో పాటు.. మధ్యప్రదేశ్, రాజస్థాన్ లకు చెందిన అభ్యర్థుల ఎంపికపై చర్చించిన తర్వాత తుది జాబితాను ప్రకటిస్తారు. అయితే, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లమీద ఎక్కువ కసరత్తు చేయాల్సి ఉంది. దీనివల్ల మొదటి విడత జాబితాలో తెలంగాణకు చెందిన 65 స్థానాలకు అభ్యర్థుల పేర్లను మాత్రమే ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది.