బంగాళాఖాతంలో మరో అల్పపీడనం... తెలుగురాష్ట్రాల్లో నేడు వర్షపాతం ఎలా వుండనుందంటే..?

By Arun Kumar PFirst Published Sep 8, 2021, 10:05 AM IST
Highlights

ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుండగా ఈ నెల 11వ తేదీన మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావం కూడా తెలుగు రాష్ట్రాలపై వుండనుందని తెలిపారు.

హైదరాబాద్: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈనెల 11వ తేదీ నాటికి ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ఏర్పడవచ్చని తెలిపారు. ఇప్పటికయితే ఈ అల్పపీడన ప్రభావం ఇరు తెలుగు రాష్ట్రాలపై(తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్) అంతగా వుండదని వాతావరణ శాఖ పేర్కొంది. గత వారం రోజులుగా తెలంగాణలో కురుస్తున్న వర్షాలు కొంత తగ్గినా సాధారణ వర్షాలయితే కొనసాగుతాయని తెలిపారు. అక్కడక్కడ మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ ప్రకటించింది.  

ఇక ఇప్పటికే బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మధ్యప్రదేశ్ కు ఆగ్నేయంగా ఆవరించి వుందని... ఇది మూడు నాలుగు రోజులపాటు పశ్చిమ వాయివ్యంగా పయనిస్తూ గుజరాత్ వరకూ సాగే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. 

గత వారం రోజులుగా తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలకు జలాశయాలు, చెరువులు నిండుకుండల్లా మారగా నదులు, వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నారు. ఇక కొన్నిప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా మారింది. జనవాసాల్లోకి వరద నీరు చేరి ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయంతో బ్రతికే పరిస్థితి ఏర్పడింది. 

read more  హుజురాబాద్: వరదల్లో చిక్కుకున్నవారి ఆకలిబాధను తీర్చి... మానవత్వం చాటుకున్న ఈటల

తెలంగాణలోని జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్, నిర్మల్, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు, చెరువులు నిండాయి. వరద ప్రవాహం జనవాసాలను ముంచెత్తి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

సిరిసిల్ల పట్టణం నీట మునిగింది. వరద నీటిలో కార్లు, మోటార్ బైక్ లు కొట్టుకుపోయాయి. ప్రజలు ఇబ్బందిపడవద్దని మంత్రి కేటీఆర్ కోరారు. కరీంనగర్ పట్టణం కూడ నీట మునిగింది. మోకాలిలోతు నీటిలోనే మంత్రి గంగుల కమలాకర్ వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటించారు. గంటన్నర లోపుగా వరద నీటిని పంపే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి కమలాకర్ చెప్పారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడ భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కామారెడ్డి జిల్లాలోని పిట్లం బాన్సువాడ మధ్యలో రాంపూర్ వద్ద  వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ ప్రవాహంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది.మద్నూరు మండలం గోజెగావ్ లోని లెండి వాగుకు వరద పోటెత్తింది. దీంతో వాహనాలు రోడ్లపైనే నిలిచిపోయాయి.

జగిత్యాలలో లో లెవల్ వంతెన పై నుండి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.జగిత్యాల-ధర్మారం,, జగిత్యాల-ధర్మపురం, జగిత్యాల-పెగడపల్లి  రోడ్లను మూసివేశారు. వరంగల్ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద పోటెత్తింది. వర్ధన్నపేటలోని ఆలేరు వాగు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది.హుస్నాబాద్ లోని ప్రధాన రహదారిపై వరద నీరు చేరింది. ప్రధాన వీధులన్నీ నీట మునిగిపోయాయి. 
 

click me!