ఇక రంగంలోకి కేసీఆర్ ... నేడు తెలంగాణ భవన్ లో కీలక భేటీ

By Arun Kumar P  |  First Published Feb 6, 2024, 7:21 AM IST

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అధికారాన్ని కోల్పోయిన బిఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటోంది. ఇందుకోసం ఢీలాపడ్డ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేసేందుకు స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగారు. 


హైదరాబాద్ : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు నేడు(మంగళవారం) తెలంగాణ భవన్ కు రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఓడిపోయి అధికారాన్ని కోల్పోయిన తర్వాత మొదటిసారి పార్టీ కార్యాలయానికి వెళుతున్నారు కేసీఆర్. ఇందుకోసం ఇప్పటికే బిఆర్ఎస్ నాయకులు అన్నిఏర్పాట్లు చేసారు. 

ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రజా భవన్ ఆనాటి ప్రగతి భవన్ ను వీడి ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికే పరిమితమైన కేసీఆర్ అనుకోకుండా ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదవశాత్తు కాలుజారి పడిపోవడంతో తుంటి ఎముక విరిగి కేసీఆర్ హాస్పిటల్ పాలయ్యారు. శస్త్రచికిత్స అనంతరం ఇంటివద్దే విశ్రాంతి తీసుకున్నారు. ఇలా దాదాపు రెండు నెలలుగా పార్టీ వ్యవహారాలకు దూరంగా వున్న ఆయన ఇటీవలే పొలిటికల్ గా యాక్టివ్ అయ్యారు. 

Latest Videos

ఇటీవలే తెలంగాణ అసెంబ్లీకి విచ్చేసిన కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసారు. పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో కలిసి అసెంబ్లీకి చేరుకున్న ఆయన స్పీకర్ గడ్డం ప్రసాద్ ముందు ప్రమాణం చేసారు. ఇలా చాలారోజుల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చారు.

Also Read  బాల్క సుమన్‌పై కేసు నమోదు.. అసలేం జరిగిందంటే..?

తాజాగా కృష్ణా నది జలాల వినియోగం, ప్రాజెక్టుల నిర్వహణ కేంద్రానికి అప్పగించడంపై వివాదం సాగుతున్న విషయం తెలిసిందే. ఈ  నేపథ్యంలో కృష్ణా పరివాహక ప్రాంతాల బిఆర్ఎస్ ముఖ్య నాయకులతో తెలంగాణ భవన్ లో కేసీఆర్ సమావేశం అవుతున్నారు. ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను కేంద్రానికి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తోంది బిఆర్ఎస్... కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించేందుకు సిద్దమయ్యింది. ఇలా కృష్ణా నదిపై ప్రాజెక్టులను కేఆర్ఎంబి పరిధిలోకి తీసుకెళ్లడాన్ని నిరసిస్తూ త్వరలో నల్గొండలో బిఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసింది. ఈ సభ నిర్వహణపైనా పార్టీ నాయకులతో కేసీఆర్ చర్చించనున్నారు. 

లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు కృష్ణా నది వ్యవహారాన్ని వాడుకోవాలని బిఆర్ఎస్ చూస్తున్నట్లు కనిపిస్తోంది. కేసీఆర్ కూడా రాజకీయంగా యాక్టివ్ అయ్యారు కాబట్టి ఇక కాంగ్రెస్ పై ఎదురుదాడి చేసేందుకు బిఆర్ఎస్ సిద్దమయ్యింది. అందులో భాగంగానే ఇటీవల బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. 
 

click me!