
తెలంగాణ రాజకీయ జేఏసీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత అందరూ ఊహించినట్లు గానే పిట్టల వర్గం స్వరం పెంచింది. ముఖ్యంగా కోదండరాం టార్గెట్ గా ఎదరుదాడికి దిగుతోంది. జేఏసీ చీలికవర్గానికి నేతృత్వం వహిస్తున్న పిట్టల రవీందర్ ఈ రోజు మరోసారి కోదండరాంపై విరుచకపడ్డారు.
జేఏసీలో అసలు అంతర్గత ప్రజాస్వామ్యమే లేదని ఆయన ఆరోపించారు. ఎన్నికలు లేకుండా అధ్యక్ష పదవిని కోదండరాం ఒక్కరే అనుభవిస్తున్నారన్నారు. అటెండర్ నుంచి అధ్యక్షుడి వరకు అన్నీ కోదండరాం ఒక్కరిసొత్తే అవుతోందని మండిపడ్డారు. తన వివరణ తీసుకోకుండానే జేఏసీ నుంచి ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు.
జేఏసీ లక్ష్యాలను సవరించుకోవాలని 2014లోనే తాను సూచించానని ఆ కారణంతో అప్పటి నుంచి తనను తప్పించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.
గతంలో జేఏసీని చీల్చాలని కొందరు ప్రయత్నిస్తే తానే ఆపానని గుర్తుచేశారు. కోదండరాం తన తీరు మార్చుకోకపోతే తెలంగాణ సమాజానికి తీరని నష్టం చేసిన వారవుతారన్నారు.
జేఏసీ తన లక్ష్యానికి విరుద్దంగా వెళ్తోందని భావించే బహిరంగ లేఖ రాస్తే తప్పెలా అవుతోందని ప్రశ్నించారు.
సోనియా గాంధీతో కోదండరాం రహస్య ఒప్పందం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయని దమ్ముంటే ఆ విషయంపై ఆయన క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కోదండరాం తన వ్యక్తిగత ఎజెండాతో విద్యార్థులను రెచ్చగొట్టి నిరుద్యోగ ర్యాలీకి పిలుపునిచ్చి అభాసుపాలయ్యరని విమర్శించారు.
జేఏసీ మహిళా నేత తన్వీర్ సుల్తానా కూడా కోదండరాంపై విమర్శలు గుప్పించారు. జేఏసీలోని కొందరు నేతలకు స్త్రీలను గౌరవించడం తెలియదని ఆరోపించారు. కోదండరామ్ తనను దారుణంగా అవమానించారని ఆరోపించారు. కోదండరామ్ తీరును నిరసిస్తూ జేఏసీ కో కన్వీనర్ పదవికి తానే రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
మరో జేఏసీ నేత ప్రహ్లాద్ మాట్లాడుతూ... కోదండరామ్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తే ప్రభుత్వ ఏజెంట్ గా చిత్రీకరించడం సరికాదన్నారు. 1996 నుంచి తాను ఉద్యమంలో ఉన్నానని గుర్తు చేశారు. కోదండరామ్ ఏం చేస్తున్నారో, ఎవరెవర్ని కలుస్తున్నారో తమకు తెలుసునన్నారు. ఆయన జేఏసీలో ఏ చర్చకు తావియ్యలేదని అంతా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
జేఏసీ సంస్థనో, పార్టీ యో కాదని ఒక అవగాహనతో జేఏసీ ఏర్పడిందని తెలిపారు. జేఏసీ నిర్మాణంపై చర్చిద్దామంటే కోదండరామ్ పట్టించుకోలేదని తెలిపారు. రాజకీయలు చేయమంటూనే కోదండరామ్ రాజకీయ పార్టీలతో కలిసి ఆందోళనలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.