Hyderabad: శ్రీరామనవమి శోభాయాత్ర సజావుగా సాగేందుకు హైదరాబాద్ పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా ఊరేగింపును పర్యవేక్షించేందుకు 1,500 మంది పోలీసులను మోహరించారు.
Rama Navami Shobha Yatra: దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా ప్రాంతాల్లో శ్రీరామనవమి శోభాయాత్రను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణలోనూ శ్రీరామ నవమి శోభాయాత్రల కోసం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు. యాత్ర వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షాల గురించి వెల్లడించారు.
వివరాల్లోకెళ్తే.. శ్రీరామనవమి శోభాయాత్ర సజావుగా సాగేందుకు హైదరాబాద్ పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా ఊరేగింపును పర్యవేక్షించేందుకు 1,500 మంది పోలీసులను మోహరించారు. గురువారం ఉదయం 9 గంటలకు సీతారాంబాగ్ ఆలయం నుంచి ప్రారంభమయ్యే ఊరేగింపు అదే రోజు రాత్రి 7 గంటలకు కోఠిలోని హనుమాన్ వ్యామశాల మైదానంలో ముగుస్తుంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సహా సీనియర్ పోలీసు అధికారులు ఈ ఊరేగింపును పర్యవేక్షిస్తారనీ, సున్నితమైన ప్రాంతాల్లో పోలీసు పికెట్లను ఏర్పాటు చేస్తామన్నారు.
undefined
ఊరేగింపు ప్రశాంతంగా జరిగేలా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిఘా, డ్రోన్ కెమెరాల సహాయంతో ఊరేగింపును పర్యవేక్షిస్తుంది. అంతేకాకుండా శాంతియుత వాతావరణానికి భంగం కలగకుండా ఐటీ సెల్ కు చెందిన సోషల్ మీడియా టీం, స్మాష్ టీం సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై ఓ కన్నేసి ఉంచనున్నాయి. ఇదిలా ఉండగా, ఊరేగింపుకు ముందు, సిద్దిఅంబర్ బజార్ మసీదు, దర్గాను వస్త్రంతో కప్పారు.
హైదరాబాద్ లో శ్రీరామనవమి శోభాయాత్ర నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు
నిర్ణీత మార్గం గుండా వెళ్లగానే ఊరేగింపు మార్గంలో ట్రాఫిక్ మళ్లుతుందని, ప్రయాణికులు తాము కోరుకున్న గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. గోషామహల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లేపల్లి జంక్షన్, బోయిగూడ కమాన్, అఘాపుర జంక్షన్, గోడే-కీ-ఖబర్, పురానాపూల్ ఎక్స్ రోడ్, ఎంజే బ్రిడ్జి, లేబర్ అడ్డా, అలాస్కా టీ జంక్షన్, ఎస్ఏ బజార్ యూ టర్న్, ఎంజే మార్కెట్ లు ఉన్నాయి. సుల్తాన్ బజార్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో అఫ్జల్ గంజ్ టీ జంక్షన్, రంగ్ మహల్ జంక్షన్, పుత్లీబౌలి ఎక్స్ రోడ్, ఆంధ్రాబ్యాంక్ ఎక్స్ రోడ్, డీఎం అండ్ హెచ్ ఎస్ ఎక్స్ రోడ్, సుల్తాన్ బజార్ ఎక్స్ రోడ్, చాదర్ ఘట్ ఎక్స్ రోడ్, కాచిగూడ ఐనాక్స్, జీపీఓ అబిడ్స్, యూసుఫియన్ అండ్ కంపెనీ, బొగ్గులకుంట ఎక్స్ రోడ్లు ఉన్నాయి.
రాజాసింగ్ పై నిఘా పెట్టిన పోలీసులు
శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్న హైదరాబాద్ పోలీసులు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, ఆయన అనుచరుల కదలికలపై నిఘా ఉంచనున్నారు. మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ నుంచి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్యేకు ఇది తొలి ఊరేగింపు కావడంతో ఈ ఏడాది హైదరాబాద్ లో నిర్వహించనున్న శ్రీరామనవమి శోభాయాత్రను విజయవంతం చేసేందుకు ముందుకు సాగుతున్నట్టు సమాచారం.