రాష్ట్రపతి ఎన్నికల్లో ఈ ముగ్గురేం చేశారో తెలుసా?

First Published Jul 18, 2017, 2:14 PM IST
Highlights
  • రాష్ట్రపతి ఎన్నికల్లో తడబడిన ఎమ్మెల్యేలు
  • యుపిఎ కు ఓటేసిన ముత్తిరెడ్డి
  • రెండు గుర్తులకు మధ్యలో ఓటేసిన కాలె యాదయ్య
  • బిజెపి అభ్యర్థికి కాదని యుపిఎ కు ఓటేసిన రాజాసింగ్
  • అసెంబ్లీలో హాట్ టాపిక్ అయిన ముగ్గురు ఎమ్మెల్యేలు

రాష్ట్రపతి ఓటింగ్ తెలంగాణలో ప్రశాంతంగా సాగింది. 119 మంది ఎమ్మెల్యేలు ఉన్న తెలంగాణ శాసనసభలో 117 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసి, పెద్దప్లలి టిఆర్ఎస్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఓటింగ్ కు రాలేదు. మరి ఓటింగ్ కు వచ్చినా సరైన పద్ధతిలో ఓటేయని వారు ఇంకొందరున్నారు. వారి వివరాలు చూద్దాం.

తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఓటింగ్ లో తడబాటుకు గురైనట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఆ ముగ్గురిలో ఇద్దరు తడబాటుకు గురి కాగా ఒక ఎమ్మెల్యే ఉద్దేశపూర్వకంగానే పార్టీ ఆదేశాలు ధిక్కరించి ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి ఓటేసినట్లు తెలుస్తోంది.

టిఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తన ఓటును ఎన్డీఎ అభ్యర్థికి కాకుండా యుపిఎ అభ్యర్థి మీరాకుమార్ కు వేశారు. తర్వాత తనకు డౌట్ వచ్చి బ్యాలెట్ పట్టుకుని మంత్రి హరీష్ రావు వద్దకు వచ్చారు. ఇలా ఓటేశానని చెప్పడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయన ఆ బ్యాలెట్ పేపర్ ను బాక్సులో వేసి మరో బ్యాలెట్ పేపర్ ఇవ్వాలని ప్రిసైడింగ్ అధికారులను కోరారు. దీనికి కాంగ్రెస్ పోలింగ్ ఏజెంట్ అభ్యంతరం తెలిపారు. దీంతో అక్కడినుంచి వెనుదిరిగారు ముత్తిరెడ్డి.

ఇక చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య సైతం తడబాటుకు గురయ్యారు. ఆయన బ్యాలెట్ పేపరు మీద ఇద్దరు అభ్యర్థులను వేరుచేసేలా ఉన్న గీత మీద ఓటు ముద్ర వేశారట. ఆ విషయాన్ని మంత్రి కెటిఆర్ వద్దకు వచ్చి చెప్పడంతో కెటిఆర్ మందలించారట. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే, కాలే యాదయ్య మాత్రం తన ఓటు మురిగిపోయేలా వేశాడని టిఆర్ఎస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

ఇక బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ ది మరొక రకమైన వ్యవహారం. ఆయన గత కొంతకాలంగా తెలంగాణ పార్టీ నాయకత్వం మీద గుర్రుగా ఉన్నారు.  దీంతో పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని ధిక్కరిస్తూ మీరా కుమార్ కే ఓటు వేసినట్లు ఆయన స్వయంగా కొందరు మీడియా ప్రతినిధులకు చెప్పారు. దీంతో బిజెపి సభ్యులు తల పట్టుకున్నారు.

మొత్తానికి ముగ్గురు ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ఎన్నికల్లో వ్యవహరించిన తీరు అసెంబ్లీలో హాట్ టాపిక్ అయింది.

click me!