
మణిపూర్ రవాణాలో అత్యంత కీలకంగా భావించే 102 నంబర్ జాతీయ రహదారిపై వంతెన కూలింది, దీంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. దేశంలోని మిగతా ప్రాంతాలకు, ఆ రాష్ట్ర రాజధాని ఇంపాల్ తో రోడ్డు సంబంధాలు తెగిపోయాయి.
వంతెనపైనుంచి భారీవాహనం ఒకటి వెళ్లినపుడు భారీశబ్దం చేస్తూ వంతెన కుప్పకూలింది. దీంతో ఈ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. సరుకుల రవాణా వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. నిత్యావసరాలు అందక ప్రజలు ఇబ్బందులకు లోనయ్యే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు.
ఈ వంతెన కూలిన నేపథ్యంలో ప్రజలకు నిత్యావసరాల కొరత ఏర్పడకుండా మణిపూర్ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకొంటోంది. ప్రభుత్వ యంత్రాంగం హుటాహుటిన వంతెన వద్దకు చేరుకుని పునరుద్ధరణ పనులను చేపట్టారు.