మంచిర్యాల జిల్లాలో ముగ్గురు వలస కూలీలకు కరోనా పాజిటివ్

By telugu teamFirst Published May 10, 2020, 10:57 AM IST
Highlights

తెలంగాణలోని మంచిర్యాలలో ముగ్గురు వలస కూలీలకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు నిర్దారణ అయింది. ఆ ముగ్గురు వలస కూలీలు మహారాష్ట్ర రాజధాని ముంబై నుంచి వచ్చారు.

మంచిర్యాల: తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో ముగ్గురు వలస కూలీలకు కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. వారిని మంచిర్యాల ఐసోలేషన్ కేంద్రం నుంచి హైదరాబాదులోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు కూలీలు కూడా ఈ నెల 5వ తేదీన ముంబై నుంచి వచ్చారు.

మంచిర్యాల జిల్లాలోని హజీపూర్ మండలం రాంపల్లికి వారు ప్రత్యేక వాహనంలో వచ్చారు. ఆ వాహనంలో ఈ ముగ్గురు మాత్రమే వచ్చారు. వారి ప్రైమరీ కాంటాక్టు ఎవరనేది తెలియడం లేదు. రాంపల్లికి రాగానే అధికారులు వారిని గుర్తించి, ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు.

ఏరియా ఆస్పత్రిలో శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపించగా, కోవిడ్ -19 పాజిటివ్ ఉన్నట్లు నివేదిక వచ్చింది. వెంటనే వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మంచిర్యాల జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కరోనా వైరస్ కేసు మాత్రమే వచ్చింది. కరోనా వైరస్ వ్యాధితో ఓ మహిళ మరణించింది. అయితే, ఆ మహిళకు ఎక్కడి నుంచి కరోనా వైరస్ సోకిందనేది ఇప్పటి వరకు తెలియలేదు.

రాష్ట్రంలో తగ్గుముఖం పట్టిందని భావిస్తున్న తరుణంలో శనివారంనాడు ఒక్కసారిగా విజృంభించింది. కొత్తగా 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాదులోనే 30 కేసులు నమోదయ్యాయి. హైదరాబాదు, వికారాబాద్, మేడ్చల్ మినహా మిగతా జిల్లాలు కరోనా వైరస్ నుంచి ఊరట పొందాయని భావిస్తున్న తరుణంలో మంచిర్యాల జిల్లాలో వలస కూలీలకు కరోనా వైరస్ సోకడం ఆందోళన కలిగిస్తోంది.

తమ తమ స్వస్థలాలకు వెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం వలస కూలీలకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ముంబై నుంచి ముగ్గురు వలస కూలీలు మంచిర్యాల జిల్లాకు చేరుకున్నారు. ముంబైలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే.

click me!