ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల మండలం మల్లబోయినపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మొక్కలు నాటుతున్న కూలీలను లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
మహబూబ్ నగర్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల మండలం మల్లబోయినపల్లి వద్ద గురువారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఉపాధి కూలీలు మృతి చెందారు. మల్లబోయినపల్లి వద్ద రోడ్డు మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో ఉపాధి కూలీలు మొక్కలు నాటుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. మొక్కలు నాటుతున్న కూలీలను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీశైలం, లిఖితతో పాటు మరొకరు మృతి చెందారు. శ్రీశైలం, లిఖిత భార్యాభర్తలు. మృతులు జడ్చర్ల మండలం ఆలూరు గ్రామానికి చెందినవారు. ఈ ఘటనలో మరొకరు గాయపడ్డారు. గాయపడిన కూలీని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బారాబంకి లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. ఆగి ఉన్న బస్సును లారీ ఢీకొనడంతో నలుగురు చనిపోయారు.మరో 24 మంది గాయపడ్డారు. టైర్ పంక్చర్ కావడంతో టైర్ మారుస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన ఈ నెల 3న చోటు చేసుకుంది. గుజరాత్ రాష్ట్రంలోని ఆరావళి జిల్లాలో కారు ఢీకొట్టడంతో ఆరుగురు మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.ఈ ఘటన ఈ నెల 2వ తేదీన జరిగింది. కాలినడకన అంబాజీమాతను దర్శించుకొనేందుకు వెళ్తున్న భక్తులపై కారు దూసుకుపోవడంతో వారు అక్కడికక్కడే మరణించారు.
గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఆగి ఉన్న ట్రక్కును కారు ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. కారులో నఖ్తరానా నుండి మాండ్వి వైపు వెళుతుండగా దావ్డా గ్రామ సమీపంలో ఆగి ఉన్న ట్రక్కును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం ఇటీవలనే చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కస్తూర్‌బెన్ గోస్వామి, సంగీతాబెన్ గోస్వామి , పరేష్ గోస్వామి , మన్‌భర్ గా గుర్తించారు.