ముగిసిన రాజ్యసభ నామినేషన్ల గడువు: తెలంగాణలో మూడు స్థానాలు ఏకగ్రీవం, ప్రకటనే తరువాయి

By narsimha lodeFirst Published Feb 15, 2024, 5:46 PM IST
Highlights


తెలంగాణలో రాజ్యసభ ఎన్నికల్లో  మూడు స్థానాలకు ముగ్గురు అభ్యర్ధులు బరిలో నిలిచారు.  నామినేషన్ల పరిశీలన తర్వాత  నామినేషన్లు సక్రమంగా ఈ ముగ్గురు అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించడమే లాంఛనం.


హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేసేందుకు  గడవు గురువారంనాడు మధ్యాహ్నంతో పూర్తైంది.  తెలంగాణ రాష్ట్రం నుండి  ముగ్గురు రాజ్యసభ సభ్యులు రిటైర్ అవుతున్నారు. దీంతో రాజ్యసభ ఎన్నికలకు  నోటిఫికేషన్ విడుదల చేసింది  ఎన్నికల సంఘం. రాష్ట్రంలోని మూడు స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ ఇద్దరిని, బీఆర్ఎస్ ఒక్క అభ్యర్ధిని బరిలోకి దింపింది.  మూడు స్థానాలకు ముగ్గురు అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. అయితే  నోటిఫికేషన్ ప్రకారంగా బరిలో  ఉన్న అభ్యర్థుల  నామినేషన్ల పరిశీలన జరపాలి. మరోవైపు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత ఈ ముగ్గురు అభ్యర్ధులు  ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా   అధికారులు ప్రకటించే అవకాశం ఉంది. 

కాంగ్రెస్ పార్టీ తరపున  మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తనయుడు అనిల్ కుమార్ యాదవ్ లను గురువారం నాడు నామినేషన్లు దాఖలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లు కూడ నామినేషన్ల దాఖలు కార్యక్రమంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్ధి వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) కూడ  ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ముగ్గురు మాత్రమే నామినేషన్లు దాఖలు చేసినందున  పోలింగ్ అవసరం ఉండదు.  అయితే నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత  ఈ ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా అధికారులు ప్రకటించనున్నారు. 

తెలంగాణ రాష్ట్రం నుండి బడుగుల లింగయ్య యాదవ్,  వద్దిరాజు రవిచంద్ర, జోగినపల్లి సంతోష్ కుమార్ లు రిటైరౌతున్నారు. దీంతో ఈ ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడ మూడు స్థానాలకు  పోలింగ్ జరగనుంది.  మూడు స్థానాలకు  వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధులను బరిలోకి దింపింది.  గొల్ల బాబురావు,  వై.వీ. సుబ్బారెడ్డి,   మేడా రఘునాథ్ రెడ్డిలను ఆ పార్టీ బరిలోకి దింపింది.


 

click me!