తెలంగాణాలో చదువు ధర్నాలు

First Published Dec 15, 2016, 11:34 AM IST
Highlights

టీచర్ ట్రయినింగ్ అడ్మిషన్లు కోరుతూ ఈ రోజు  తెలంగాణాలో  వేలాది మంది విద్యార్థులు ధర్నాలు జరిపారు.

 

ఫీజు రియంబర్స్ మెంట్ బెడద నుంచి తప్పుకునేందుకు తెలంగాణా ప్రభుత్వం ఎంట్రన్స్ పరీక్షలు జరపక పోవడానికి, అడ్మిషన్లను వాయిదా వేయడానికి నిరసనగా ఈరోజు వేలాది మంది విద్యార్థులు తెలంగాణాలోని 31 జిల్లాల్లో ధర్నాలు నిర్వహించారు.

 

ఇంటర్ తర్వాత టీచర్ ట్రెయినింగ్ కోర్సు పరీక్ష రాసేందుకు ఎదురు చూస్తున్న విద్యార్థులు, బి.ఇడి సెట్ పాసయినా  అడ్మిషన్ కు నోచుకొనని విద్యార్థులు ఈ ధర్నాలలో పాల్గొన్నారు. తెలంగాణా ప్రయివేటు లెక్చరర్ల ఫోరం కూడా ఈ ఆందోళనకకు పూర్తి మద్ధతు ప్రకటించింది.  టిఆర్ ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్నవిద్యావిధానాలను వారు తీవ్రంగా నిరసించారు.

 

  డిఎడ్ ఎంట్రన్స్ నోటిఫికేషన్ వస్తుందని ఎదురు చూస్తూ ఇంటర్ పాసయిన చాలా మంది విద్యార్థులు డిగ్రీలో చేరడం మానేశారు. దాదాపు ఇరవై వేల మంది దాకా ఇలా విద్యార్థులు ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. టీచర్ ట్రయినింగ్ పాసయితే,  ప్రయివేటో, గవర్నమెంటో ఏదో ఒక స్కూళ్లో టీచర్ గా చేరవచ్చేనేది తెలంగాణా పోరగాళ్ల కోరిక.

 

అయితే,  ఎంట్రన్స్ పరీక్ష నోటిఫికేషన్ ఇస్తే అడ్మిషన్లు పూర్తి చేయాలి, ఆ తర్వాత పీజు రియింబర్స్ మెంటు ఉంటుంది. తర్వాత కోర్సు పూర్తయ్యాక టీచర్స్ ను రిక్రూట్ చేయాలని గోల చేస్తారు. ఈ బెడద లేకుండా ఉండేందుకు ఎంట్రన్స్ నిర్వహించకుండా పోతే సరి అనేది  ప్రభుత్వ విధానంగా ఉందని ప్రయివేటు లెక్చరర్ల  ఫోరం కన్వీనర్ కుమార్  చెప్పారు. 

 

ఇదే విధంగా బిఇడి అడ్మిషన్లను కూడా స్తంభింప చేశారని ఆయన ఆరోపించారు. ఇలా జాప్యం చేస్తే కాలేజీలు మూతపడతాయి, అడ్మిషన్ల సంఖ్య తగ్గుతుంది, ఫీజు రియింబర్స్ మెంటు నుంచి తప్పించుకోవచ్చనేది ప్రభుత్వం ఎత్తుగడ అని ఆయన ఆరోపించారు.

 

 ఈ విధానాల వల్ల  విద్యావ్యవస్థ అస్తవ్యస్తం అవుతున్నదని,  ఈ విధానాలు మానుకొనకపోతే, ఉద్యమం ఉధృతం చేస్తామని  కుమార్ హెచ్చరించారు.

click me!