
ఉపాధి వేటలో దుబాయ్ కి వెళ్లిన తెలంగాణ యువకుడు ఇప్పుడు అంపశయ్యపై వేలాడుతున్నాడు. మనం స్పందిచకపోతే మరణమే అతడికి ఇక శరణం. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బాల్కొండకు చెందిన శంకర్ 2004లో ఉపాధి కోసం దుబాయి వెళ్లాడు.
అక్కడే తాపీ పనికి కుదిరాడు. 2009 లో రాజస్థాన్‌కు చెందిన రామావతార్ కుమావత్ ప్రమాదవశాత్తు కిందపడి చనిపోయాడు. దీనికి ఫోర్‌మన్‌గా ఉన్న శంకరే కారణమంటూ పోలీసులు హత్యానేరం మోపి జైలుకు పంపించారు.
దుబాయ్ చట్టం ప్రకారం హత్య కేసులో నిందితులకు ఉరిశిక్ష తప్పదు. కేసు విచారణ జరుగుతుండటంతో తొమ్మిదేళ్లుగా శంకర్ జైల్లోనే ఉన్నాడు. కొడుకు పుట్టినా కనీసం ఇప్పటి వరకు శంకర్ చూడలేదు.
ప్రస్తుతం అతడి కుటుంబ సభ్యులు.. రాజకీయ నాయకులు, అధికారుల చుట్టు తిరుగుతూ శంకర్ ను కాపాడాలని కోరుతున్నారు. కాగా, నెలరోజుల్లో క్షమాభిక్ష పత్రం తీసుకరాకపోతే మరణశిక్ష తప్పదని అబుదాబీ కోర్టు శంకర్ కు స్పష్టం చేసింది.
దీంతో తన భర్తను కాపాడాలంటూ అతని భార్య భూదేవి, కొడుకు రాజు ప్రభుత్వానికి విజ్జప్తి చేస్తున్నారు. మృతి చెందిన రాజస్థాన్‌కు చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులు మాకూరి శంకర్‌కు క్షమాభిక్ష ప్రసాదిస్తున్నట్లు లేఖ ఇస్తే శంకర్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలున్నాయి. గతంలో ఈ పద్ధతిలో ప్రయత్నించి ఉరిశిక్ష తప్పించుకున్న వాళ్లున్నారు. దీంతో శంకర్‌ను సైతం ఇలాగే కాపాడేండుకు తెలంగాణ ప్రభుత్వం రాజస్తాన్ ప్రభుత్వంతో చర్చించాలని కోరుతున్నారు.
మరోవైపు, శంకర్ కూడా దుబాయ్‌లోని ఇండియన్ ఎంబసీకి తనను కాపాడాలని లేఖ రాయడంతో అధికారులు స్పందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంబసీ అధికారులు లేఖలు రాశారు. తెలంగాణ సర్కారు దీనిపై రాజస్థాన్ ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందన లేదు. యాదాగౌడ్ గతేడాది రాజస్తాన్ వెళ్లి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అయితే ఆరున్నర లక్షలిస్తే క్షమాభిక్ష లేఖ ఇచ్చేందుకు ఆ కుటుంబం అంగీకరించింది.
అయితే తినటానికే దిక్కులేని పరిస్థితుల్లో ఉన్న శంకర్ భార్య, కొడుకు.. అంతమొత్తం కట్టలేక తమ కుటుంబాన్ని కాపాడాలంటూ యాచిస్తున్నారు.మనసున్నోళ్లెవరైనా శంకర్‌ను వెనక్కుతెచ్చేందుకు ఆర్థిక సాయం చేస్తే అతడి మరణశిక్ష రద్దు అయ్యే అవకాశం ఉంది.