ఈ హిమజారెడ్డి ఇపుడు సోషల్ మీడియా హాట్ టాపిక్

First Published Nov 18, 2017, 10:48 AM IST
Highlights
  • సోషల్ మీడియాలో మారుమ్రోగిన హిమజారెడ్డి
  • సోషల్ సర్వీస్ చేస్తున్న నల్లగొండ ఆణిముత్యం
  • జీవితాంతం పోరాటం చేస్తూనే ఉంటానని ప్రతిన
  • జర్నలిస్టుగా పనిచేస్తూనే సమాజ సేవ

 

ఈ అమ్మాయి పేరు హిమజారెడ్డి. ఒక టివి ఛానల్ లో జర్నలిస్టుగా పనిచేస్తున్నది. ఇది కేవలం వృత్తి మాత్రమే. కానీ ఈమె ప్రవృత్తి చాలా ఉన్నతమైనది.. గొప్పది. ఎవరూ చేయలేనిది. అందరు మెచ్చుకునేది. అనాథలకు ఆసరాగా నిలవడం, తిండి లేనివారికి, వైద్యం అందని వారికి చేయూతనందించడం, చేతనైన సాయం చేయడం. నల్లగొండ జిల్లా ఆణిముత్యం హిమజారెడ్డి గురించి ఏషియానెట్ అందిస్తున్న ప్రత్యేక కథనం.

పేరు హిమజ, పుట్టింది నల్లగొండ జిల్లాలోని చండూరు. తల్లిదండ్రులు అలివేలు, నర్సిరెడ్డి. హిమజకు అమ్మా నాన్న అక్క తమ్ముడు ఉన్నారు. వరంగల్ జిల్లాకు చెందిన రవితో హిమజకు వివాహం అయింది. ప్రస్తుతం ఆమె భర్త సాఫ్ట్ వేర్ ఉద్యోగి. హిమజారెడ్డి 10 వరకు చదివింది నల్లగొండలో. పేరెంట్స్ హైద‌రాబాద్‌లో స్థిరపడినా.. టెన్త్ క్లాస్ వ‌ర‌కు బాల‌స‌ద‌న్‌లో చ‌దువుకుంది. ఆ జీవితమే హిమజను ఉన్నతంగా మలిచింది. సేవాగుణం పెంపొందించింది. లక్షలు, కోట్లు సంపాదన కంటే నలుగురికి సాయం చేయడమే గొప్ప పని అని హిమజను ఆ దిశగా మలిచినది మాత్రం స్కూల్ చదువే. ఆ సమయంలోనే మేట్రిన్స్ లలిత, కృష్ణ‌వేణి(వాళ్లను అమ్మా అనే పిలుస్తుంది.) జీవితాన్ని ఎలా మ‌లుచుకోవాలో నేర్పించారని హిమజ అంటున్నది. ఇంట‌ర్ హైదరాబాద్ నవీన జూనియర్ కాలేజిలో పూర్తి చేసింది. డిగ్రీ కోఠి ఉమెన్స్ కాలేజిలో, డిస్టెన్స్ లో ఎంబిఎ, ఎంసిజె పూర్తి చేసింది.

డిగ్రీ చదివే రోజుల నుంచే మీడియాలో జర్నలిస్టుగా పని చేస్తున్నది. ఉన్నంతలో పక్కవాళ్లకు సాయం చేయాలనే తపన తనది. అందుకే ప్రస్తుతం తనకు వచ్చే జీతంతో ముగ్గుర్ని చదివిస్తున్నారు. అందులో ఒక అమ్మాయికి ఇటీవల ఉద్యోగం వచ్చింది. మరో ఇద్దరు ఇంకా చదువుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో విశాఖపట్నం కు చెందిన ఎన్.ఎ.  రెడ్డి సహకారంతో Hope For Life Foundation అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు హిమజారెడ్డి. ఈ సంస్థ ద్వారా సర్వీస్ చేసేందుకు ఒక్కొక్కరుగా జాయిన్ అయ్యారు. ఇప్పటికి టీంలో 25మంది దాకా యాక్టివ్ పర్సన్స్ ఉన్నారు. హెల్త్, ఎడ్యుకేషన్ పై మెయిన్ ఫోకస్ చేస్తున్నారు. ప్రతిరోజు 5 , 6 బ్లడ్ కేసెస్ క్లోస్ చేస్తున్నాం. ఇప్పటి వరకు 23 కేసులు చేశారు.

ఇంకా 5 కేసులు ప్రాసెస్ లో ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 20 ఈవెంట్స్ వ‌ర‌కు కంప్లీట్ చేశారు. ప్రతి ఈవెంట్ కి వారి సొంత డబ్బు ఖ‌ర్చు చేస్తున్నారు. హెల్త్ , ఎడ్యుకేష‌న్ సర్వీస్ విషయంలో ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన ఫ్రెండ్స్ స‌పోర్ట్ తీసుకుంటున్నారు. పేద‌రికం, ఆప‌ద‌, అవ‌స‌రం, ఆనారోగ్యం ఎక్క‌డ ఉంటే..అక్క‌డ హోప్ ఫ‌ర్ లైఫ్ టీమ్ ద్వారా చేయూతనందిస్తామంటున్నారు. ఎంతో మంది ఉన్నత చ‌దువుల‌కు సాయం చేస్తున్నాం, కొంత‌మంది మానసిక వికలాంగులను ద‌త్త‌త తీసుకుని చూసుకుంటున్నారు.  హిమజ టీమ్ చేసే ప్రతి సర్వీస్ లో బాదితులు కోలుకునేలా, వారు తమ జీవితాల్లో నిల‌బ‌డేలా చేయూత నందిస్తున్నారు.

హిమజారెడ్డి చేస్తున్న ఈ సేవలే ఆమెను ఎంతోమంది అభాగ్యులు అమ్మా అని పిలిచేస్థాయికి తీసుకొచ్చాయి. తాను అమ్మ కాకపోయినా వీరందరూ నన్ను అమ్మా అని పిలుస్తారు అని హిమజ గర్వంగా చెబుతున్నారు. సోషల్ మీడియా స్నేహితులంతా హిమజారెడ్డిని అక్కా, చెల్లి అంటూ పిలుస్తారు. హోప్ ఫ‌ర్ లైఫ్‌ స్వచ్ఛంద సంస్థలో బ్యాక్ స‌పోర్ట్ ఎంతో మంది ఉన్నప్పటికీ.. ఎన్ ఏ రెడ్డి, వెంక‌ట్‌,  లాల్‌, నాగార్జున, కేఎన్ రెడ్డి, చేత‌న్‌, ప్ర‌సాద్ రెడ్డి, గిరిధర్‌, స్వాతి, యూన‌స్‌, రోహిత్‌, శ‌శిద‌ర్‌, మేఘ‌న‌, ప్ర‌దీప్‌, ఫ‌ణి నంద‌, అనిల్‌. శేఖ‌ర్‌, శ్రీధ‌ర్‌, రాజు, నాగబాబు లాంటివాళ్లు ప్రత్యక్షంగా హిమజతో కలిసి ప్రయాణం చేస్తున్నారు.

త‌ల‌సేమియా కిడ్స్ కోసం ఎక్కువ‌గా బ్ల‌డ్ క్యాంప్స్ కండెక్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు 22 మంది బాధితులకు అవసరమైన సాయం అందించారు హిమజారెడ్డి టీమ్. ప్రస్తుతం మరో ఐదుగురుకి సర్వీస్ కొనసాగుతున్నదని హిమజ అంటున్నది.

 

 

‘‘అది ప్రజ్ఞాపూర్ లోని ఆశాజ్యోతి ఎయిడ్స్ కేర్ సెంటర్.. అక్కడ హెచ్ఐవి చిన్నారులకు వైద్యం, జీవితం అందిస్తుంటారు. దాదాపు 50 మంది వరకు చిన్నారులు హెచ్ఐవి బాధితులు అక్కడ ఉంటున్నారు. మొన్నటి వరకు ఆశాజ్యోతి సంస్థకు ప్రభుత్వ సాయం అందేది. కానీ ఇటీవల సాయం నిలిచిపోయిందట.

మా టీమ్ అక్కడకు వెళ్లి 50వేల రూపాయలు వెచ్చించి అక్కడి పిల్లలకు బ్లాంక్లెట్లు, స్వెట్టర్లు, చెప్పులు కొనిచ్చినం. పిల్లలందరికీ భోజనాలు చేయించుకుని తీసుకుపోయి తినిపించినం. ఆ సమయంలో నేను పిల్లలను ఒడిలో కూర్చోబెట్టుకుని తినిపించిన.

అప్పుడు ఆ సంస్థ నిర్వాహకులు అన్నదేమంటే..? ఇప్పటి వరకు ఎంతోమంది దాతలు వచ్చిర్రు, సాయం చేసిర్రు కానీ ఎవరు కూడా పిల్లలను ముట్టుకోలేదు.. తాకలేదు. నువ్వు మాత్రం వాళ్లకు కూర్చోబెట్టుకుని భోజనం తినిపించావు తల్లీ. నీది గొప్ప గుణం అన్నారు. అయినా హెచ్ఐవి ఏమీ అంటువ్యాధి కదుకదా అని నేను అన్నాను. కానీ హెచ్ఐవి,  ఎయిడ్స్ వచ్చిన వాళ్లను చిన్నచూపు చూస్తారు కదమ్మా అని వాళ్లన్నరు. నన్ను చూసి వాళ్లు సంతోషించిర్రు.

హెచ్ఐవి బాధితులే కాదు హిజ్రాలంటే కూడా ఈ సమాజానికి చిన్నచూపే ఉంటది. హిజ్రాలతో కలవాలన్నా, వాల్ళను ముట్టుకోవాలన్నా ఈసడించుకునేవారే ఎక్కువ. నాకు కూడా చిన్నప్పుడు హిజ్రాలంటే భయం ఉండేది. కానీ వాళ్లు కూడా మనుషులే అని తర్వాత తెలుసుకున్న. వారితో కలిసి ఫొటోలు దిగిన. వాళ్లు చాలా సంతోషించారు. హెచ్ఐవి, ఎయిడ్స్ బాధితులను, హిజ్రాలను మనం చిన్నచూపు చూసుడు మంచిగనిపిస్తలేదు. ఈ పరిస్థితి మారాలి. మనమే మార్చాలి.’’ అని చెబుతోంది హిమజ.

ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు రాష్ర్టాల్లో మాత్ర‌మే హిమజ టీమ్ తమ సేవలను అందిస్తున్నది. కానీ హోప్ ఫర్ లైవ్ సంస్థను అన్ని ప్రాంతాలకు విస్తరించే యోచనలో ఉన్నట్లు హిమజ చెబుతున్నారు. అయితే తమతో కలిసి పనిచేసేవారు ముందుకొస్తే మిగతా రాష్ట్రాల్లో కూడా సర్వీస్ అందిస్తామంటున్నారు. తన చివరి శ్వాస వ‌ర‌కు అన్నార్థులు, అభాగ్యుల జీవితాల్లో వెలుగు నింపేందుకు పనిచేస్తానని హిమజారెడ్డి ధీమాగా చెబుతున్నారు.

click me!