
తెలంగాణ రాష్ట్రం వస్తే బతుకులు బాగుపడతాయని హోంగార్డులు కలలు కన్నారు. అయితే వారికి ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఎక్కువ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. దీంతో హోంగార్డులు శనివారం హైదరాబాద్ లో సదస్సు ఏర్పాటు చేశారు. హోంగార్డుల సంఘం గౌరవాధ్యక్షలు, బిజెపి శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి దీన్న ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు హాజరుకావాలనుకున్న హోంగార్డులను ప్రభుత్వం కట్టడి చేసింది. జిల్లాల ఎస్సీలకు ఆదేశాలిచ్చి హోంగార్డులు జిల్లాల నుంచి కదలకుండా నియంత్రించింది. అయినప్పటికీ చాటుమాటుగా కొందరు, తెగింపుతో మరికొందరు హైదరాబాద్ సదస్సుకు చేరుకున్నారు. సదస్సుకు హాజరు కాకుండా హోంగార్డులపై తీవ్ర నిర్బంధం ప్రయోగించడంతో హోంగార్డులంతా వారి భార్యా పిల్లలను, కుటుంబసభ్యులను ధర్నాకు పంపారు.
సదస్సులో సంఘం గౌరవాధ్యక్షులు జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ 2004నుండి హోంగార్డుల కోసం పోరాడూతున్నామన్నారు. వైఎస్ ప్రభుత్వంలోనూ అన్ని పార్టీలను ఏకం చేసామని, సమస్యలను శాసన సభలోనూ ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళామన్నారు. కాంగ్రెస్ కంటే ఈ ప్రభుత్వం నియంతృత్వంగా పాలన సాగిస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు.హోంగార్డుల్లో ఎక్కవ మంది బడుగు బలహీన వర్గాల వారే ఉన్నారని వారికి ప్రభుత్వంనుండి వారికి ఎటువంటి బెనిఫిట్స్ ఉండవని ఆవేదన వ్యక్తం చేశారు. హోంగార్డుల కంటే స్నిప్పర్ డాగ్స్ జీతం ఎక్కువగా ఉందని విమర్శించారు.
రాష్ట్రంలోని అన్ని కమీషనరేట్లకు... ఎస్పీలకు లేఖలు రాసి హోంగార్డులు హైదరాబాద్ రాకుండా అడ్డుకున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. సమస్యల పరిష్కారానికి ప్రతిపక్షంలో హామీ ఇచ్చిన టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు నోరు మెదపడం లేదన్నారు. ఇది నిజాం.. నియంతృత్వ పాలన కాదు.. ప్రజాస్వామ్య పాలన అన్న విషయం మరచిపోరాదని హెచ్చరించారు. తక్షణమే హోంగార్డులకు కనీసం 19వేల జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. హోంగార్డులు పోలీసులతో సమానంగా పనిచేస్తున్నా వీరికి వేతనంతో కూడిన సెలవులు కూడా ఉండవని ఆవేదన వ్యక్తం చేశారు. వారు సదస్సుకు రాకుండా నిర్భందిస్తే సమస్యలు పరిష్కారం కావని స్పష్టం చేశారు. స్పెషల్ పోలీస్ అసిస్టెంట్స్ గా హోంగార్డులను గుర్తించాలన్నారు. రెండు సంవత్సరాలుగా ఊరిస్తున్నా వారి డిమాండ్లు మాత్రం నెరవేర్చడంలేదన్నారు.
శకినాల నారాయణ... బెల్లంపల్లి హోంగార్డ్
సదస్సులో పాల్గొన్న బెల్లంపల్లికి చెందిన హోంగార్డు శకినాల నారాయణ మాట్లాడుతూ మీటింగ్ కు హాజరవుతానని నన్ను బైండ్ ఓవర్ చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఎలాగోలా ఇబ్బందులు పడుతూ హైదరాబాద్ లో సదస్సుకు హాజరైనట్లు చెప్పారు. తనను వెతుక్కుంటూ బెల్లంపల్లి పోలీసులు ఇక్కడికీ వచ్చారని, తనకేమైనా అయితే తెలంగాణ సర్కారుదే బాధ్యత అన్నారు నారాయణ. సమస్యలు పరిష్కరించాల్సిందిపోయి ఇలా వేధించడం మంచిది కాదన్నారు.
సదస్సు అనంతరం హోంగార్డులు సహా కిషన్ రెడ్డి ధర్నాకు దిగారు. దీంతో కిషన్ రెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి