పాదయాత్రకు బ్రేక్.. గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరిన బీజేపీ

By Mahesh RajamoniFirst Published Aug 24, 2022, 11:57 AM IST
Highlights

హైదరాబాద్: జనగాం జిల్లాలో తమ పాదయాత్రపై దాడికి కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కుట్ర పన్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. 
 

హైదరాబాద్: తెలంగాణ బీజేపీ ప్రజాసంగ్రామ యాత్రను తక్షణమే నిలిపివేయాలని రాష్ట్ర పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో బండి సంజ‌య్ ప్ర‌జా సంగ్రామ యాత్ర‌కు బ్రేక్ ప‌డింది. ఈ క్ర‌మంలోనే  పోలీసుల ఆదేశాల నేప‌థ్యంలో ఈ విష‌యంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను ఆ రాష్ట్ర బీజేపీ నేత‌లు క‌వ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఇందులో జోక్యం చేసుకోవాల‌ని కోరుతున్నారు. బీజేపీ నేతల బృందం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి, పాదయాత్ర కొనసాగించేందుకు అనుమతించాలని, భద్రత కల్పించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)ని కోరాలని కోరుతూ మెమోరాండం సమర్పించింది.

బీజేపీ ఎంపీ కె. లక్ష్మణ్‌, జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి, పార్టీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఇతర నేతలు గవర్నర్‌ను కలిసి రాష్ట్ర బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ అక్రమ అరెస్టుపై విచారణ జరిపించాలని, యాత్ర ఆగిపోవడానికి దారితీసిన పరిస్థితులపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.  జనగాం జిల్లాలో పాదయాత్రపై దాడికి కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కుట్ర పన్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. సోమవారం హైదరాబాద్‌లో బీజేపీ కార్యకర్తలపై పోలీసులు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడి చేసిన ఘటనపై విచారణ జరిపించాలని కోరారు.

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) కుమార్తె, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే క‌ల్వ‌కుంట్ల క‌విత ప్రమేయం ఉన్నందున ఢిల్లీలో మద్యం కుంభకోణంపై దృష్టి మరల్చేందుకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం పాదయాత్రను నిలిపివేసిందని లక్ష్మణ్ విలేకరులతో అన్నారు. తన కూతురుపై వచ్చిన ఆరోపణలపై ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనం వహించడాన్ని విజయశాంతి ప్రశ్నించారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని, బండి సంజయ్‌ చేస్తున్న పాదయాత్రను తక్షణమే ఆపాలని జనగాం జిల్లా బీజేపీ నేతలను పోలీసులు ఆదేశించడంతో బీజేపీ ప్రతినిధి బృందం గవర్నర్‌ను కలిసింది.

మద్యం కుంభకోణానికి పాల్పడ్డారంటూ కవిత ఇంటి బయట సోమవారం హైదరాబాద్‌లో బీజేపీ కార్యకర్తలపై నిరసనకు దిగినందుకు నిరసనగా సోమవారం బండి సంజయ్‌ను జనగాం జిల్లాలో పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు కూడా అయిన సంజయ్ కరీంనగర్ కు త‌ర‌లించారు. అనంతరం గృహనిర్బంధంలో ఉంచారు. దీంతో బండి సంజయ్ కరీంనగర్‌లోని ఆయన నివాసంలోనే దీక్ష చేపట్టారు. ఓ వైపు బండి సంజయ్ ఇంటికి ఆయన మద్దతుగా బీజేపీ కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉండటం.. మరోవైపు టీఆర్ఎస్‌ శ్రేణులు కూడా ఆయన  ఇంటి ముట్టడికి యత్నించే అవకాశం ఉండటంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 

మ‌ధ్యం స్కామ్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రమేయం బయటపడుతుందనే తన పాదయాత్రను అడ్డుకున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. లిక్కర్ స్కామ్‌తో కవితకు సంబంధం లేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. కవితపై లిక్కర్ స్కామ్‌ ఆరోపణలై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం కరీంనగర్‌లో మహాలక్ష్మి ఆలయంలో బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సంగ్రామ యాత్ర తప్పకుండా కొనసాగుతుందని అన్నారు. షెడ్యూల్ ప్రకారమే ఈ నెల 27న వరంగల్‌లో ప్రజా సంగ్రా యాత్ర ముగింపు సభ ఉంటుందన్నారు. 
 

click me!