
లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రమేయం బయటపడుతుందనే తన పాదయాత్రను అడ్డుకున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. లిక్కర్ స్కామ్‌తో కవితకు సంబంధం లేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. కవితపై లిక్కర్ స్కామ్ ఆరోపణలై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం కరీంనగర్‌లో మహాలక్ష్మి ఆలయంలో బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సంగ్రామ యాత్ర తప్పకుండా కొనసాగుతుందని అన్నారు. షెడ్యూల్ ప్రకారమే ఈ నెల 27న వరంగల్‌లో ప్రజా సంగ్రా యాత్ర ముగింపు సభ ఉంటుందన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బహిరంగ సభలో పాల్గొంటారని.. ఈ సభను విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఇక, ప్రజా సంగ్రామ యాత్ర నిలిపివేయాలన్న పోలీసుల నోటీసులపై బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో లంచ్ మోహన్ పిటిషన్ దాఖలు చేశారు ప్రజా సంగ్రామ యాత్ర కొసాగించేందుకు అనుమతులు ఇచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరింది. మధ్యాహ్నం 3.45 గంటలకు ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. కోర్టు నుంచి అనుమతి వస్తే.. బండి సంజయ్ కరీంనగర్ నుంచి నేరుగా జనగామ వెళ్లనున్నారు.
ఇంట్లోనే బండి సంజయ్ దీక్ష..
తెలంగాణలో జరుగుతున్న అక్రమ అరెస్టులు, దాడులు, నిర్బంధాలపై బీజేపీ నేడు నిరసన దీక్షకు దిగింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టనుంది. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రస్తుతం గృహ నిర్బంధంలో ఉన్నారు. దీంతో బండి సంజయ్ కరీంనగర్‌లోని ఆయన నివాసంలోనే దీక్ష చేపట్టారు. ఓ వైపు బండి సంజయ్ ఇంటికి ఆయన మద్దతుగా బీజేపీ కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉండటం.. మరోవైపు టీఆర్ఎస్ శ్రేణులు కూడా ఆయన ఇంటి ముట్టడికి యత్నించే అవకాశం ఉండటంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.