
హైదరాబాద్‌లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ గ్రూప్ ఫీనిక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై ఆదాయపు పన్ను శాఖ రెండో రోజు సోదాలు కొనసాగిస్తుంది. మంగళవారం ఉదయం ఇతర ప్రాంతాలను ఐటీ అధికారులు ఫీనిక్స్ గ్రూప్‌కు చెందిన ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫీనిక్స్ గ్రూప్‌కు చెందిన జూబ్లీహిల్స్, మాదాపూర్, ఇతర కార్యాలయాలు, డైరెక్టర్ల నివాసాల్లో సోదాలు జరిగాయి. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే బుధవారం కూడా ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. సోదాల సమయంలో ఐటీ అధికారులు భద్రత కోసం పారామిలటరీ బలగాల సహాయం తీసుుకున్నారు.
ముంబై నుంచి హైదరాబాద్‌కు వచ్చిన మరికొన్ని ఐటీ బృందాలు ఈ సోదాల్లో పాల్గొంటున్నాయి. ఫీనిక్స్ గ్రూప్‌కు సంబంధించిన 25 చోట్ల సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఆంధ్రాలోని ఫీనిక్స్ మోటార్ లిమిటెడ్ ఆఫీసులోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మోటార్ బిజినెస్‌లోనూ ఫీనిక్స్ కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టింది. అయితే సోదాల్లో ఫీనిక్స్ కంపెనీకి చెందిన కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఫీనిక్స్ డైరెక్టర్లను గంటల తరబడి ఐటీ అధికారులు ప్రశ్నించినట్టుగా సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
ఫీనిక్స్ గ్రూప్‌లో పలువురు రాజకీయ నేతల పెట్టుబడులు ఉన్నాయనే ప్రచారం నేపథ్యంలో.. ఐటీ సోదాలు చర్చనీయాంశంగా మారాయి. ఇక, రియల్ ఎస్టేట్‌తో పాటు మైనింగ్, ఆటోమొబైల్స్, పవర్, వెల్‌నెస్, ఎడ్యుకేషన్‌లో ఫీనిక్స్ కంపెనీ పెట్టుబడులు పెట్టినట్టుగా నివేదికలు సూచిస్తున్నాయి.