కాల్పులు జరిగినప్పుడు షిపాలి అక్కడే ఉందా?

Published : Jul 29, 2017, 11:08 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
కాల్పులు జరిగినప్పుడు షిపాలి అక్కడే ఉందా?

సారాంశం

కాల్పుల సమయంలో షిపాలి కూడా పక్కనే ఉందా? ఆమె సాక్ష్యాలను తారుమారు చేశారంటున్న పోలీసులు బయటివారు చేసిన పనికాదని తేల్చిన పోలీసులు విక్రం కాల్చుకున్నాడా? ఇంట్లో వాళ్లే కాల్చారా? బయటకొచ్చిన కుటుంబ కలహాల కోణంం

హైదరాబాద్ నగరంలో పెరిగిపోతున్న విచ్చలవిడి గన్ కల్చర్ కు విక్రం గౌడ్ ఫైరింగ్ ఘటన తార్కాణంగా నిలిచింది. విక్రం కాల్పుల ఘటనలో విప్పలేని చిక్కుముళ్లు ఎన్నో ఉన్నాయి. పోలీసులు ఎంతగా శ్రమిస్తున్నా వాస్తవాలు బయటకు వస్తున్న పరిస్థితి లేదు. అసలు ఇదంతా ఎందుకు జరిగింది? ఎవరు చేశారు? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎవరు కాల్చారు? ఎవరు తప్పించుకుంటున్నారు? ఎవరు నటిస్తున్నారు? ఎవరు దోషులు? ఎవరు నిర్దోషులు అన్నది తేలాలంటే మరికొంత కాలం పట్టే అవకాశం ఉంది.

విక్రం కాల్పుల ఘటన బయటి ప్రపంచానికి తెలియగానే ఆయనకు అప్పులున్నాయని, ఆయన డ్రగ్ కేసు భయం ఉందన్న ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రచారంలో వాస్తవం లేదని తాజా విచారణలో తేలిపోతున్నది. కుటుంబ కలహాల వల్లే విక్రమ్ గౌడ్ ఆత్మహత్యకు ప్రయత్నించాడని సమాచారం బయటకొచ్చింది. అదే నిజమైతే విక్రమ్ గౌడ్ దగ్గరకు తుపాకీ ఎలా వచ్చిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనా స్థలంలో లభించిన పెల్లట్ల ఆధారంగా నాటు తుపాకీ ఉపయోగించినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. దాంతో ఈ కేసులో సెక్షన్లు మార్చాలని ప్రయత్నిస్తున్నారు. ఆత్మహత్యకు ప్రయత్నించడం ఒక నేరమైతే.. అక్రమంగా ఆయుధం కలిగి ఉన్న నేరం మోపుతో మరో కేసు నమోదు చేసే అవకాశం ఉంది.

కాల్పులు జరిగిన తరువాత ఆ ప్రదేశంలో రక్తం తుడిచేయడంతో కొన్ని సాక్ష్యాలు పాడయ్యాయని, ఇది ఉద్దేశ పూర్వకంగానే చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకు విక్రమ్ భార్య షిపాలి నే కారణమని పోలీసులు భావిస్తున్నారు. విక్రమ్, షిపాలి ఇద్దరి చేతులపై గన్ ఫౌడర్ గుర్తులు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కాల్పులు జరిగినప్పుడు షిపాలి కూడా సంఘటనా స్థలంలోనే ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అందుకే కాల్పులు జరిగిన తర్వాత తుపాకీ మాయమైపోయింది. ఆ సమాచారం దొరకడంలేదు. దానిని పని మనిషికి ఇచ్చి పంపేశారని అంటున్నారు. పనిమనిషి కూడా అదృశ్యం కావడంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయని పోలీసులు చెబుతున్నారు.

మరోవైపు అపోలో ఐసియులో చికిత్స పొందుతున్న విక్రం శరీరంలోంచి బులెట్‌ను బయటకు తీశారు. ప్రాణాపాయం లేదని చెబుతున్నారు వైద్యులు. విక్రమ్ గౌడ్ ఇచ్చిన వాంగ్మూలం, కేసు దర్యాప్తులో కీలకం కానుంది. కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తించాలంటూ పోలీసులకు విక్రమ్ గౌడ్, షిపాలి ఇద్దరూ చెబుతున్నారు. కానీ వారి మాటలను పోలీసులు అస్సలే నమ్మడం లేదు. కాల్పులు జరపడానికి బయటినుంచి వేరే వ్యక్తులు వచ్చినట్లు సరైన ఆధారాలు లభ్యం కావడం లేదని పోలీసులు చెబుతున్నారు.

ఏ కోణంలో చూసినా బయటివారు చేసిన పని కాదని పోలీసులు కుండబద్ధలు  కొట్టినట్లు చెబుతున్నారు. అసలు అతనే కాల్చుకున్నాడా? లేక ఇంట్లో ఉన్నవారెవరైనా కాల్చారా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ విషయంలో సాంకేతిక ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. తనపై అనవసర ఆరోపణలు చేయవద్దంటు మీడియాకు విక్రమ్ భార్య షిఫాలి విజ్ఞప్తి చేశారు. విక్రమ్ అన్ని వివరాలు పోలీసులకు వెల్లడించారని చెప్పారు.

మొత్తానికి విక్రం గౌడ్, ఆయన భార్య ఇద్దరూ ఉద్దేశపూర్వకంగానే కీలకమైన విషయాలు దాచిపెడుతున్నారని పోలీసులు బలంగా విశ్వసిస్తున్నారు. కాల్పుల సమయంలో షిపాలి కూడా పక్కనే ఉందన్న అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. మరి ఆమె పక్కన ఉండగానే విక్రం కాల్చుకున్నాడా? లేక ఇంకేమైనా జరిగిందా? అన్నది తేలాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్
IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!