ప్రతి విద్యార్థిని ఉన్న‌త విద్యావంతుడుగా చేయ‌డ‌మే ల‌క్ష్యం.. ఇది తెలంగాణ‌ కేజీ టు పీజీ క్యాంప‌స్

Published : Dec 24, 2022, 05:09 PM IST
ప్రతి విద్యార్థిని ఉన్న‌త విద్యావంతుడుగా చేయ‌డ‌మే ల‌క్ష్యం.. ఇది తెలంగాణ‌ కేజీ టు పీజీ క్యాంప‌స్

సారాంశం

Hyderabad: తెలంగాణ తొలి కేజీ టు పీజీ కళాశాల.. అంగ‌న్‌వాడీ కేంద్రం, ప్రీ ప్రైమ‌రీ స్కూల్, ప్రైమ‌రీ స్కూల్, హై స్కూల్, జూనియ‌ర్ కాలేజీ, డిగ్రీ కాలేజీని ఆరు ఎక‌రాల్లో నిర్మించ‌డం జ‌రిగింది. ఈ విద్యాల‌యంలో 3,500 మంది విద్యార్థులకు విద్య‌ను అందిస్తున్నారు. మొత్తం 90 త‌ర‌గ‌తి గదుల‌తో పాటు కంప్యూర్, సైన్స్ ల్యాబ్స్, లైబ్ర‌రీ, స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్లు ఈ క్యాంప‌స్ లో ఉన్నాయి.  తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలో  కోర్సులు అందిస్తున్నారు.   

Telangana KG to PG campus: అందరికి విద్య.. ప్రతి విద్యార్థిని ఉన్న‌త విద్యావంతుడుగా చేయ‌డ‌మే ల‌క్ష్యంగా తెలంగాణ‌ ప్ర‌భుత్వం ముందుకు సాగుతున్న‌ద‌ని ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) నాయ‌క‌త్వంలోని బీఆర్ఎస్ (టీఆర్ఎస్) ప్ర‌భుత్వం పేర్కొంది. దీని కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం అన్ని ర‌కాల చ‌ర్య‌ల‌ను తీసుకుంటున్న‌ద‌ని ఇప్ప‌టికే ప‌లు మార్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దీనిలో భాగంగా ప్ర‌భుత్వం కేజీ టు పీ ఉచిత విద్య కోసం క‌ళాశాల‌ల‌ను ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ తొలి కేజీ టు పీజీ కళాశాల రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏర్పాటైంది. రాష్ట్ర ప్రభుత్వం కిండర్ గార్టెన్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ను అన్ని సౌక‌ర్యాల‌తో నిర్మించింది. అందరికీ ఉచిత విద్యను అందించడానికి గంభీరావుపేటలో ఈ క్యాంప‌స్ ను అధునాత స్టైల్లో నిర్మించారు. 

గంభీరావు పేట‌లో ఉన్న  కేజీ టు పీజీ క్యాంప‌స్ ఆరు ఎకరాల విస్తీర్ణంలో (100,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో) 3,500 మందికి పైగా విద్యార్థులకు సేవలు అందిస్తోంది. ఈ మోడల్ క్యాంపస్ లో అంగన్ వాడీ కేంద్రం, ప్రీ ప్రైమరీ స్కూల్, ప్రైమరీ స్కూల్, హైస్కూలు, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజీ భవనాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా గంభీరావుపేటలో కేజీ టు పీజీ క్యాంపస్ ను ఏర్పాటు చేశారు. ఈ క్యాంపస్ ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ మాధ్యమాలను బోధిస్తుందని అధికారులు తెలిపారు.

 

అధికారులు 250 మందికి పైగా పిల్లలకు బాల్య విద్య కోసం సౌకర్యాలను కల్పించారు. విశాలమైన క్యాంపస్ లో డిజిటల్ క్లాస్ రూమ్ లు, కంప్యూటర్, సైన్స్ ల్యాబ్ లతో సహా 90 కి పైగా తరగతి గదులు ఉన్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇలాంటి సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కే.తారకరామారావు (కేటీఆర్) వెల్ల‌డించారు. గంభీరావు పేట‌లో ఉన్న కేజీ టు పీజీ క‌ళాశాల క్యాంప‌స్ కు సంబంధించిన వీడియోల‌ను ట్విట్ట‌ర్ లో పంచుకున్నారు. ప్ర‌స్తుతం ఇది వైర‌ల్ గా మారింది. ''తెలంగాణలో మారుతున్న విద్యా ముఖచిత్రాన్ని మీకు పరిచయం చేస్తాను'' అంటూ రాజన్న సిరిసిల్ల ఎమ్మెల్యే రామారావు  సంబంధిత క్యాంప‌స్ వీడియోను ట్వీట్ చేశారు.

 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించినప్పటి నుండి.. ముఖ్య‌మంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నాయకత్వంలోని బీఆర్ఎస్ (టీఆర్ఎస్) ప్రభుత్వం సమగ్ర విధానాలు, అత్యాధునిక సౌకర్యాల ద్వారా అందరికీ విద్యను అందుబాటులోకి తీసుకురావ‌డంతో పాటు.. నాణ్యతతో విద్య‌ను అందించ‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటోంద‌ని మంత్రి పేర్కొన్నారు. 2014 లో తెలంగాణ రాష్ట్ర సమితి (ఇప్పుడు భారత్ రాష్ట్ర సమితి) కేజీ టు పీజీ ఉచిత విద్యా పథకాన్ని వాగ్దానం చేసింది. ఇచ్చిన మాటను ప్రభుత్వం నెరవేర్చలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ హామీని అమలు చేయడంలో విఫలమైందని విమ‌ర్శించాయి. అయితే,  షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీల కోసం గత ఎనిమిదేళ్లలో వందలాది రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మించామనీ, విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచామని కేసీఆర్ ప్రభుత్వం పేర్కొంది.

కాగా, తెలంగాణలో కేజీ టు పీజీ క్యాంపస్ నిర్మాణంపై ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. 'విజన్ ఉన్న నాయకుడు.. మంచి రేపటి భ‌విష్య‌త్తు కోసం ఒక ఉద్దేశ్యంతో ఉన్న నాయ‌కుడు.. ధన్యవాదాలు కేసీఆర్ గారూ'' అని ట్వీట్ చేశారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : ఈ ఐదు జిల్లాలకు పొంచివున్న పిడుగుల గండం... తస్మాత్ జాగ్రత్త
IndiGo Airlines Hyderabad: ఇండిగో విమానాలు ఆలస్యం.. ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం | Asianet News Telugu