జానారెడ్డికి అగ్ని పరీక్ష

First Published Sep 15, 2017, 12:22 PM IST
Highlights
  • కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్
  • జానా ఆలోచనలపై పార్టీ నేతల టెన్షన్
  • రాజకీయ ఉద్దండుడే కదా? ఆయన నిర్ణయంలో తిరుగుండదంటున్న కార్యకర్తలు

రాజకీయ ఉద్దండుడు, ఫ్రొఫెషనల్ పొలిటీషియన్ గా పేరుగాంచిన కుందూరు జానారెడ్డికి అగ్ని పరీక్ష ఎదురైంది. ఆయన ఈ పరీక్షను ఎలా ఎదుర్కొంటాడన్న ఆసక్తి ఇటు కాంగ్రేస్ శ్రేణుల్లోనే కాక రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల్లో నెలకొంది. ఇంతకూ జానారెడ్డికి ఎదురైన అగ్ని పరీక్ష ఏమటబ్బా అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదవండి.

శుక్రవారం సాయంత్రం సమాచార కమిషనర్ల నియామకం కోసం ప్రగతి భవన్ లో కీలక సమావేశం ఉంది. ఈ సమావేశానికి నిబంధనల ప్రకారం ప్రతిపక్ష నేతను కూడా ఆహ్వానిస్తారు. ఈరోజు జరగనున్న సమావేశానికి జానారెడ్డికి కూడా కబురు అందింది.

అయితే ఇంతకాలం ప్రగతిభవన్ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ తీవ్రమైన విమర్శల వర్షం కురిపించింది. ఇప్పటికే సిఎంకు అన్ని సౌకర్యాలతో కూడిన భవనం బేగంపేటలో ఉండగా దాన్ని కాదనుకుని వాస్తు పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేశారని కాంగ్రెస్ తోపాటు అన్ని పార్టీలు దుమ్మెత్తిపోశాయి. ప్రగతిభవన్ లో బుల్లెట్ ప్రూఫ్ బాత్ రూమ్ ల నిర్మాణం చేయడమేంటని ప్రశ్నించాయి.

ఈ విషయంలో జానారెడ్డి కూడా గట్టిగానే ప్రగతిభవన్ నిర్మాణాన్ని వ్యతిరేకించారు. మరి ఇంతగా ప్రగతిభవన్ మీద విమర్శల వర్షం కురిపించిన నేపథ్యంలో జానారెడ్డి ప్రగతిభవన్ లో జరిగే సమాచార కమిషనర్ల నియామక సమావేశానికి హాజరవుతారా? లేదా అన్నది హాట్ టాపిక్ అయింది.

ఈ సమావేశం సచివాలయంలో ఉంటే జానారెడ్డి హాజరు అయితే బాగుండేదని, అలా కాకుండా విమర్శలు గుప్పించిన ప్రగతిభవన్ లో సమావేశానికి జానారెడ్డి హాజరు కావడం బాగుండదేమోనని కాంగ్రెస్ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. అయినా రాజకీయ ఉద్ధండుడు కదా? ఆయన మంచి నిర్ణయమే తీసుకుంటారని ఆయన వెల్లడించారు.

మరి జానారెడ్డి ప్రగతి భవన్ మెట్లెక్కుతారా? లేదా అన్నది సాయంత్రానికి కానీ తేలదు.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

click me!