
గత రెండు వారాలుగా నల్లడొండ ఉప ఎన్నిక గురించి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఏ పార్టీలో అయినా అదే చర్చ. అసలు ఆ ఇష్యూ ఎందుకొచ్చిందంటే ఎవరూ చెప్పలేరు కానీ టిఆర్ఎస్ వర్గాలే ఉపఎన్నిక లీక్ ను ఇచ్చాయని మాత్రం తేలింది. అయితే ఆ లీక్ సిఎం కేసిఆర్ కు తెలిసే బయటకొచ్చిందా? లేక ఆయనకు తెలియకుండానే పార్టీలో ఇంకెవరైనా లీక్ ఇచ్చారా అన్నది ఇంకా తేలాల్సి ఉంది.
ఇక నల్లగొండ ఉప ఎన్నిక అనివార్యమైతే ఏ పార్టీ నుంచి ఎవరు పోటీలో ఉంటారో ఇప్పటికే పేర్లు కూడా బయటకొచ్చేశాయి. అయితే ఇంతకూ ఉప ఎన్నిక వస్తుందా రాదా అన్నది ఇప్పటి వరకు టిఆర్ఎస్ పార్టీ అధికారికంగా వెల్లడించలేదు. ఎవరి స్థానంలో ఉప ఎన్నిక వస్తుందో ఆ వ్యక్తి అంటే గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఇప్పటి వరకు ఉప ఎన్నిక మీద పల్లెత్తు మాట మాట్లాడలేదు. అయినా రాజకీయాల్లో మాత్రం చర్చోపచర్చలు జరుగుతున్నాయి.
ఇక టిడిపి అంచనాలు మాత్రం ఇంకోలా ఉన్నాయి. నూటికి 99 శాతం ఆ స్థానికి ఉప ఎన్నిక రాదని టిడిపి బలంగా నమ్ముతున్నది. ఈ విషయంలో టిడిపి వాదన ఆసక్తికరంగా ఉంది. టిఆర్ఎస్ పార్టీ వాళ్లు ఇటీవల నల్లగొండ పార్లమెంటు పరిధిలో ఒక సర్వే చేయించుకున్నారట. ఆ సర్వేలో టిఆర్ఎస్ కు గొప్పగా ఏమీ పాజీటీవ్ రాలేదట. అందుకే ముందుగా ఉప ఎన్నికకు వెళ్లాలనుకున్నప్పటికీ తర్వాత వెనకడుగు వేశారట. ఇదీ ఉప ఎన్నికపై టిడిపి అంతర్గత అంచనా.
ఈ పరిస్థితుల్లో ఒకవేళ టిఆర్ఎస్ సాహసమే చేసి ఎన్నికల బరిలోకి దిగితే మాత్రం రేవంత్ ను బరిలోకి దిపండం ద్వారా గెలిచినా, ఓడినా గట్టి పోటీ ఇవ్వొచ్చని ఆ పార్టీ నేతలు అనుకుంటున్నారు. ఇది తాజా వ్యూహంగా కనిపిస్తోంది. అయితే ఇంతకుముందు వేరే వ్యూహం టిడిపి చేసింది. ఉపఎన్నిక అంటూ వచ్చే అవకాశముంటే మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డిని బరిలోకి దించాలనుకున్నారు. ఆమేరకు కసరత్తు కూడా జరిపారు. కానీ తాజాగా సర్వే ఫలితాల విషయంలో వారికి సమాచారం అందడంతో ప్లాన్ మార్చినట్లు చెబుతున్నారు.
ఉప ఎన్నిక వస్తే రేవంత్ ను బరిలోకి దింపే విషయంలో ఇప్పటికే చర్చల స్థాయిలోనే ఉన్నాయని ఇంకా ఫైనల్ కాలేదని నల్లగొండకు చెందిన ఒక టిడిపి నాయకుడు అన్నారు. అయితే ఉప ఎన్నిక వస్తదని ఎంపిగా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి కానీ టిఆర్ఎస్ లో క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు కానీ ఎవరూ అధికారికంగా చెప్పనప్పుడు మేము దీనిపై ఎలా స్పందిస్తామని ఆయన అన్నారు. ఈ విషయంలో టిఆర్ఎస్ లీకుల వ్యవహారం నడుపుతూ జనాలను కన్ఫ్యూజ్ చేస్తుంది కాబట్టి మేం కూడా టిఆర్ఎస్ కు సెగ తగిలేలా మాత్రమే మాట్లాడుతున్నట్లు చెప్పుకొచ్చారు.
మొత్తానికి టిఆర్ఎస్ ఉప ఎన్నికపై లీకులే ఇచ్చింది. పార్టీలో ముఖ్య నేతలెవరూ చెప్పలేదు. అందుకే టిడిపి నేతలు కూడా అధికారికంగా చెప్పడంలేదు. పైగా పార్టీలో కనీసం ఒక స్థాయి ఉన్న నాయకుడు అయినా చెప్పడంలేదు. దీన్నిబట్టి రెండు వైపుల నుంచి లీకుల పోరాటం నడుస్తున్నట్లు కనబడుతున్నది. మరి ఇది ఉత్తుత్తి లీకుల ఫైట్ గానే మిగిలిపోతదా? లేకపోతే రెండువైపులా పంతానికి పోయి సాహసానికి దిగి తాడోపేడో తేల్చుకునేదాకా వస్తదా అన్నదానిపై త్వరలోనే క్లారిటీ రానుందంటున్నారు.