
వరంగల్: కాకతీయ యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు (మార్చి 29) తలపెట్టిన విద్యార్థి ఉద్యమమకారుల సంఘర్షణ సభ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఇందుకు అనుమతి లభించలేదు. ఈ క్రమంలోనే విద్యార్థి సంఘాల నేతలు యూనివర్సిటీలో నిరసనకు దిగారు. యూనివర్సిటీ వీసీ ఛాంబర్‌లోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. అయితే వారిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
అడ్మినిస్ట్రేటివ్ భవనం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. వర్సిటీ గేటు ఎదుట టైర్లు అంటించే ప్రయత్నం చేయగా.. పోలీసులు పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు యూనివర్సిటీకి తరలివస్తున్న విద్యార్థులను అడ్డుకుని.. అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. దీంతో యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక, సంఘర్షణ సభకు అనుమతి ఇవ్వకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. అయినా తాము న్యాయ పోరాటం చేసి సభ నిర్వహిస్తామని విద్యార్థి సంఘం నేతలు చెబుతున్నారు.
ఇక, వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చెప్పారు. విద్యార్ధులు శాంతియుతంగా సమావేశం ఏర్పాటు చేసుకుంటామంటే అనుమతి ఇవ్వకపోవడం సరికాదని అన్నారు. రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం మంచింది కాదని సూచించారు. రాష్ట్రంలో యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తున్నారని.. చైతన్యాన్ని చంపేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో యూనివర్సిటీల పాత్రను మర్చిపోవద్దని అన్నారు. అరెస్ట్ చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సభకు అనుమతి ఇవ్వాలి అని ఈటల రాజేందర్ ఒక ప్రకటనలో కోరారు.