టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్.. విషయం వెలుగులోకి రాకుండా ప్రలోభాలు!.. ముగ్గురిని కస్టడీలోకి తీసుకున్న సిట్..

By Sumanth KanukulaFirst Published Mar 29, 2023, 1:43 PM IST
Highlights

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. పేపర్ లీకేజీ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించి ప్రవీణ్, రాజశేఖర్‌ గురించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. పేపర్ లీకేజీ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించి ప్రవీణ్, రాజశేఖర్‌ గురించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రవీణ్, రాజశేఖర్‌లు పేపర్ లీక్ చేసిన విషయాన్ని అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ షమీమ్, ఔట్ సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ రమేష్‌లు గుర్తించారు. అయితే ఈ విషయాన్ని షమీమ్, ప్రవీణ్‌లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా ఉండేందుకు.. ప్రవీణ్‌, రాజశేఖర్‌లు వారిని ప్రలోభపెట్టినట్టుగా సిట్ అధికారులు గుర్తించారు. గ్రూప్-1 పేపర్ ఇస్తామని, ఎగ్జామ్ రాసి జాబ్ సంపాదించవచ్చని ఆశ చూపినట్టుగా కనుగొన్నారు. ఇక, ఈ కేసును విచారిస్తున్న సిట్ అధికారులు ఇప్పటికే షమీమ్, రమేష్ కుమార్‌లతో పాటు వారి మాజీ సహాద్యోగి సురేష్‌లను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే షమీమ్, రమేష్ కుమార్‌లతో పాటు వారి మాజీ సహాద్యోగి సురేష్‌లకు గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం ఇచ్చామని ప్రవీణ్, రాజశేఖర్ ఒప్పుకున్నట్టుగా సిట్ అధికారులు తెలిపారు. వారంతా 100 మార్కులకు పైగా సాధించి మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారని చెప్పారు. అయితే వీరు ఎంతమందికి పేపర్స్ లీక్ చేశారనే అంశంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

ఈ క్రమంలోనే షమీమ్, రమేష్, సురేష్‌ల నుంచి సమాచారం రాబట్టేందుకు సిట్ అధికారులు.. వారిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిట్ స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో మంగళవారం కోర్టు ఈ ముగ్గురికి ఐదు రోజుల కస్టడీని మంజూరు చేసింది. దీంతో పోలీసులు వారిని నేడు చంచల్‌గూడ జైలు నుంచి అదుపులోకి తీసుకన్నారు. నేటి నుంచి ఐదు రోజుల పాటు వారిని విచారించనున్నారు. ఈ కేసులో టీఎస్‌పీస్సీకి చెందిన ఉద్యోగుల్లో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా? లేదా? అనే విషయాన్ని సిట్ అధికారులు విచారణలో గుర్తించే అవకాశం ఉంది.  

click me!