
Telangana : తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ రగడ ఉద్రిక్తలకు దారితీస్తోంది. నాయకుడులు తీవ్రమైన వ్యాఖ్యలతో విమర్శలు, ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఆయా పార్టీల నాయకులు దూషణల పర్వానికి తెరతీయడంతో తమ నాయకులకు తక్కువ కాదంటూ.. కార్యకర్తలు ఒకరిపై ఒకరు కొట్టుకునే స్థాయికి వెళ్తున్నారు. దీంతో రాష్ట్రంలో నిత్యం రాజకీయం రచ్చ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్), ప్రతిపక్ష పార్టీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యకర్తలు ఘర్షణకు దిగారు. మంగళవారం రాత్రి బెల్లంపల్లిలో వాట్సాప్ గ్రూప్‌లో వచ్చిన ఓ సందేశం విషయంలో ఒకరినొకరు కొట్టుకోవడంతో కొద్దిసేపు స్థానికంగా ఉద్రిక్తత నెలకొన్నది.
రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇన్‌స్టంట్ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ గ్రూపులో తమ నాయకులను దుకాణ యజమాని దుర్భాషలాడారని ఆరోపిస్తూ పట్టణంలోని ఓ వాణిజ్య సంస్థ ఎదుట టీఆర్‌ఎస్ సభ్యులు బైఠాయించారు. నాయకులను కుక్కల్లా పిలుస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను బర్తరఫ్ చేయాలని, ఆ పార్టీ కార్యకర్త సాయి కుమార్ మృతికి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి కొయ్యల ఏమాజీ ఆధ్వర్యంలో బీజేపీ అనుచరులు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దిష్టిబొమ్మను బజార్ ఏరియాలో దహనం చేశారు.ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
ఈ విషయం తెలుసుకున్న టీఆర్‌ఎస్ కార్యకర్తలు సంఘటనా స్థలానికి చేరుకుని దిష్టిబొమ్మను దహనం చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్), ప్రతిపక్ష పార్టీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యకర్తలు వాగ్వివాదానికి దిగారు. దూషణలకు దారితీసిన పరిస్థితుల్లో ఒకరినొకరు నెట్టుకున్నారు. దీంతో ఆ ఏరియాలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడి చేరుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఘర్షణ పడుతున్న రెండు వర్గాలను శాంతింపజేశారు. అనంతరం టీఆర్‌ఎస్ సభ్యులు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీ కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. కొద్ది సమయం తర్వాత పోలీసులు ఇరు వర్గాలను అక్కడి నుంచి వెళ్లగొట్టారు.
కాగా, ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయిగణేశ్ ఆత్మహత్య ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. సాయి ఆత్మహత్యకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. సాయిగణేష్ ఆత్మహత్యకు నిరసనగా అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ నిరసనలకు దిగింది. సాయి గణేశ్ ఆత్మహత్యపై సీబీఐ విచారణకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతలు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ కార్యకర్త సాయి గణేశ్ కుటుంబాన్ని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పరామర్శించారు. సాయిగణేష్ చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ యువ కార్యకర్తలను కోల్పోయిందని రాజీవ్ అన్నారు. ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆయన దుయ్యబట్టారు. ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరపాలని రాజీవ్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.