
హైదరాబాద్: Tribal రిజర్వేషన్లపై కేంద్రం వైఖరికి నిరసనగా హైద్రాబాద్‌లోని BJP కార్యాలయాన్ని ముట్టడించేందుకు బుధవారం నాడు గిరిజన సంఘాలు ప్రయత్నించాయి. అయితే గిరిజన సంఘాల కార్యకర్తలను Police అరెస్ట్ చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకొంది.
గిరిజన రిజర్వేషన్లపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ గిరిజన సంఘాలు ఇవాళ బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించాలని నిర్ణయం తీసుకొన్నాయి. గిరిజన సంఘాలు బీజేపీ కార్యాలయం వైపునకు దూసుకెళ్తున్న గిరిజన సంఘం కార్యకర్తలను పోలీసులు అడ్డుకొన్నారు.
గిరిజనుల రిజర్వేషన్ల అంశానికి సంబంధించి టీఆర్ఎస్ అనుబంధ సంఘాలు ఆందోళన చేస్తాయని సమాచారం తెలుసుకొన్న బీజేపీ కార్యకర్తలు కూడా పార్టీ కార్యాలయం వద్దకు చేరుకొన్నారు. టీఆర్ఎస్ అనుబంధ గిరిజన సంఘాల కార్యకర్తులు బీజేపీ కార్యాలయం వైపునకు వచ్చే సమయంలో బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో రోడ్డుపై బారికేడ్లు వేసి ఇరు వర్గాలను పోలీసులు నిలువరించారు. బీజేపీకి, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ అనుబంధ సంఘాల కార్యకర్తలు నినాదాలు చేశారు. టీఆర్ఎస్ కు, తెలంగాణ సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఇరు వర్గాల కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
రిజనులకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ఇదే అంశంపై తెలంగాణ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రతిపాదించింది. ఎస్టీల రిజర్వేషన్లను 6 నుండి 10 శాతానికి పెంచాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపినా కూడా కేంద్రం మాత్రం తమ వద్దకు ఈ తీర్మానం రాలేదని చెప్పడంపై టీఆర్ఎస్ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర గిరిజన శాఖ మంత్రిపై ప్రివిలేజ్ మోషన్ నోటీసు ఇచ్చారు. 2017లోనే కేంద్రానికి తాము ఈ తీర్మానం పంపిన విషయాన్ని టీఆర్ఎస్ ఎంపీలు గుర్తు చేస్తున్నారు. గిరిజనుల రిజర్వేషన్ల పెంపుపై కేంద్రం తీరుపై నిరసన వ్యక్తం చేసిన టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ నుండి వాకౌట్ చేశారు. ఆ తర్వాత కేంద్రం తీరును తీవ్రంగా తప్పుబట్టారు.
వరి ధాన్యంతో పాటు రాష్ట్రానికి అన్ని అంశాలపై కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని టీఆర్ఎస్ భావిస్తుంది. ఈ మేరకు పార్లమెంట్ ఉభయ సభల్లో కేంద్రం తీరుపై టీఆర్ఎస్ ఎంపీలు నిరసనకు దిగనున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన టీఆర్ఎస్ శాసనసభపక్షం సమావేశంలో పార్లమెంట్ ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై పార్టీ ఎంపీలకు కేసీఆర్ దిశా నిర్ధేశం చేశారు.వరి ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ ను కలిసేందుకు తెలంగాణ మంత్రులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకొన్నారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్ర మంత్రిని కోరనున్నారు.
వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం నుండి సానకూలంగా స్పందన రాకపోతే తెలంగాణ తరహలో పోరాటం చేయాలని టీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. అయితే వరి ధాన్యం కొనుగోలుకు కేంద్రం సహకరిస్తుందని చెప్పినా కూడా ఈ విషయమై టీఆర్ఎస్ సర్కార్ రాజకీయం చేస్తుందని బీజేపీ విమర్శలు చేస్తుంది. టీఆర్ఎస్, బీజేపీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర రైతుల ప్రయోజనాలను ఫణంగా పెడుతున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.