నారాయణపేట జిల్లాలోని చిత్తనూరులో ఇవాళ ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామస్తులపై పోలీసులు లాఠీ చార్జీ చేశారు. పోలీసులపై గ్రామస్తులు తిరగబడ్డారు.
నారాయణపేట:జిల్లాలోని చిత్తనూర్ గ్రామంలో ఆదివారంనాడు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ గ్రామానికి సమీపంలో ఆగ్రో ఇథనాల్ ఫ్యాక్టరీ ఉంది.ఈ ఫ్యాక్టరీలోని వ్యర్థాలను చిత్తనూరు గ్రామానికి సమీపంలో వాగులో పారబోసేందుకు ట్యాంకర్ వచ్చింది. ఈ విషయాన్ని గమనించిన ఏక్లాస్ పూర్, చిత్తనూరు గ్రామస్తులు ఈ ట్యాంకర్ ను అడ్డుకున్నారు. వ్యర్థాలను శుద్ది చేసే ప్లాంట్ ను ఏర్పాటు చేసుకోకుండా తమ గ్రామాల సమీపంలోని వాగులు, ఖాళీ స్థలాల్లో వేయడం వల్ల తమ పంటలు, చెరువుల్లోని నీరు కలుషితం కానుందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటును కూడ తాము వ్యతిరేకించిన విషయాన్ని గ్రామస్తులు గుర్తు చేస్తున్నారు.
గ్రామానికి సమీపంలోని వ్యర్థాలను డంప్ చేసేందుకు వచ్చిన ట్యాంకర్ ను రెండు గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు.ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. వ్యర్థాలను తమ గ్రామ సమీపంలో ఉన్న వాగులో వేయవద్దని కోరారు. ఈ విషయమై గ్రామస్తులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గ్రామస్తులను చెదరగొట్టే క్రమంలో పోలీసులు లాఠీచార్జీ చేశారు. దీంతో ఆగ్రహంతో గ్రామస్తులు పోలీసులపై తిరగబడ్డారు. గ్రామస్థుల దాడిలో మక్తల్ సీఐ రాంలాల్ గాయపడ్డారు. పోలీస్ వాహనానికి గ్రామస్తులు నిప్పు పెట్టారు.దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.
ఫ్యాక్టరీకి అనుకూలంగా పోలీసులు వత్తాసు పలుకుతున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పోలీసులపై గ్రామస్తుల దాడితో చోటు చేసుకున్న ఉద్రిక్తత నేపథ్యంలో ఈ గ్రామానికి అదనపు బలగాలను పోలీసులు రప్పిస్తున్నారు