గ్రూప్-2 పరీక్ష వాయిదాకై: టీఎస్‌పీఎస్‌సీ వద్ద అభ్యర్థుల ధర్నా, ఉద్రిక్తత

Published : Aug 10, 2023, 12:06 PM ISTUpdated : Aug 10, 2023, 02:19 PM IST
గ్రూప్-2 పరీక్ష వాయిదాకై: టీఎస్‌పీఎస్‌సీ వద్ద అభ్యర్థుల ధర్నా, ఉద్రిక్తత

సారాంశం

గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు  కోరుతున్నారు.  టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.

హైదరాబాద్: గ్రూప్-2  పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ  అభ్యర్థులు  గురువారంనాడు  టీఎస్‌పీఎస్‌సీని ముట్టడించేందుకు  ప్రయత్నించారు.  గ్రూప్ -2 పరీక్ష రాసే అభ్యర్థులకు  ఎన్ఎస్‌యూఐ, ఓయూ  విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి.   టీఎస్‌పీఎస్‌సీ వరకు  ర్యాలీగా వచ్చిన  గ్రూప్-2 అభ్యర్థులు కార్యాలయం లోపలికి వెళ్లేందుకు  ప్రయత్నించారు.

 అయితే  గ్రూప్-2 అభ్యర్థులను  టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయంలోనికి వెళ్లేందుకు  వెళ్లకుండా  పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకు దిగిన  వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  మరో వైపు  గ్రూప్-2 పరీక్ష రాసే  అభ్యర్థులకు తెలంగాణ జనసమితి  చీఫ్  కోదండరామ్  మద్దతిచ్చారు.  గ్రూప్-2 పరీక్షలను  వాయిదా వేయాలని ఆయన ప్రభుత్వాన్ని  కోరారు.ఈ విషయమై అసెంబ్లీలో కోరినా కూడ  ప్రభుత్వం నుండి స్పందన రాకపోవడంపై  ఆయన  అసంతృప్తి వ్యక్తం  చేశారు.

ఈ నెల  29, 30 తేదీల్లో  గ్రూప్ 2 పరీక్షలను నిర్వహించాలని టీఎస్‌పీఎస్‌సీ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది డిసెంబర్ మాసంలో ఈ పరీక్షల నిర్వహణకు  సంబంధించిన నోటిఫికేషన్ ను టీఎస్‌పీఎస్‌సీ జారీ చేసింది. ప్రభుత్వ రంగంలోని వివిధ విభాగాల్లోని  783 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు టీఎస్‌పీసీఎస్  గ్రూప్ 2 పరీక్షలను నిర్వహించనుంది. అయితే  ఇదే నెలలో గురుకుల,  జూనియర్ లెక్చరర్ పరీక్షలున్నాయి. దీంతో గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఒకే నెలలో మూడు  ముఖ్యమైన పరీక్షలు ఉండడంతో  ఇబ్బందులున్నాయని వారు చెబుతున్నారు.

also read:గ్రూప్-2 పరీక్ష వాయిదాకోరుతూ విద్యార్థుల ర్యాలీ, అరెస్ట్: ఓయూలో ఉద్రిక్తత

గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.  రెండు రోజుల క్రితం ఓయూలో  ఆందోళనకు దిగారు.  ఇవాళ టీఎస్‌పీఎస్‌సీ వద్ద ఆందోళనకు దిగారు. టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయం వద్ద బైఠాయించారు. గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని  డిమాండ్  చేశారు.

ఆందోళన చేస్తున్న  వారిలో ఆరుగురిని చర్చలకు టీఎస్‌పీఎస్‌సీ పిలిచారు. కనీసం మూడు మాసాల పాటు  పరీక్షలను వాయిదా వేయాలని  అభ్యర్థులు కోరుతున్నారు.  అయితే ఈ విషయమై  టీఎస్‌పీఎస్‌సీ ఎలాంటి నిర్ణయం తీసుకొంటుందోననే  ఉత్కంఠ నెలకొంది. టీఎస్‌పీఎస్‌సీ పరీక్షలను వాయిదా వేస్తే పరీక్షలు నిర్వహించేందుకు రానున్న రోజుల్లో కష్టమనే అభిప్రాయంతో టీఎస్‌పీఎస్‌సీ ఉందనే  ప్రచారం సాగుతుంది.  

 

 

PREV
click me!

Recommended Stories

CP Sajjanar Serious On Journalist: ఎక్కడున్నా తీసుకొస్తా… ఇన్వెస్టిగేట్ చేస్తా | Asianet News Telugu
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు... ఈ రెండు జిల్లాలకు రెయిన్ అలర్ట్