తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సినిమా దర్శకుడు బీ నర్సింగరావు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ప్రజా సంస్కృతిక సినిమా రంగాల గురించి మాట్లాడాల్సి ఉన్నదని, ఈ శాఖలను ఎత్తిపట్టడానికి కొత్త నిర్ణయాలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ చిత్రాన్ని బయటి ప్రపంచానికి పరిచయం చేసిన, తెలంగాణ సినిమాకు ప్రపంచ గౌరవం తెచ్చిన ప్రముఖ సినీ దర్శకుడు బి నర్సింగరావు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారుడు, ఫిలాంత్రోపిస్ట్.. దాసి, మా భూమి, రంగుల కల వంటి సినిమాలతో దశాబ్దాల క్రితమే తెలంగాణ సినిమాలకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. గతంలో తెలంగాణ ఐటీ శాఖ మాజీ మంత్రి కేటీఆర్‌కు ఆయన ఓ బహిరంగ లేఖ రాశారు. సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ మీద నిప్పులు చెరిగారు. తనను ప్రభుత్వం మానసికంగా వేధిస్తున్నదని, గత ఎనిమిదేళ్లుగా తన ఫోన్ ను ట్యాపింగ్ చేస్తూ అందరిని దూరం చేసి, పైశాచిక ఆనందం ఎందుకు పొందుతున్నారో అర్ధం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ లేఖను గతంలో ఏసియా నెట్ న్యూస్ యధాతధంగా పాఠకుల కోసం ప్రచురించింది.
బి. నరసింగరావు తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ముఖ్యమంత్రి గారికి రాసిన ఆ లేఖను పాఠకుల కోసం యధాతధంగా ఇక్కడ ఇస్తున్నాం.
Also Read : Delhi: 45 ఏళ్ల పెయింటర్‌కు విజయవంతగా రెండు చేతులను ట్రాన్స్‌ప్లాంట్ చేసిన వైద్యులు
‘తెలంగాణలో కొత్త ప్రభుత్వానికి వంద రోజులు నిండిన సందర్భంగా అభినందనలు. ఈ వంద రోజులుగా నేను మిమ్మల్ని కలవడానికి చెయ్యని ప్రయత్నం లేదు. ఎన్నో రంగాల వాళ్ళు వచ్చి మిమ్మల్ని కలిసి వెళుతున్నారు. అలాంటి అవకాశం నాకు రాకపోవడం విడ్డూరంగా ఉంది. నన్ను నేను మీకు ప్రత్యేకంగా పరిచయం చేసుకోవలసిన అవసరం లేదనుకుంటాను.
ఈ లేఖ రాయడానికి ముఖ్య కారణం, నేను మీతో కలిసి కొన్ని అత్యవసర విషయాలు మాట్లాడవలసి ఉండడమే : తెలంగాణ ప్రజా సంస్కృతిక సినిమా రంగాల గురించి మీతో మాట్లాడాలి. ఈ సందర్భంలో ప్రభుత్వము కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఎంతో ఉంది. ఇంకా కాలయాపన మంచిది కాదు. పైన పేర్కొన్న రంగాలలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ముఖ్యమైన అంశాలను మనం పూర్తి చేయవలసి ఉంది. పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డ సాంస్కృతిక అంశాలను నేటి ప్రభుత్వం పైకిఎత్తి పట్టుకోవలసిన అవసరం కోసం ప్రణాళికలు రూపొందించుకొని తెలంగాణను నూతనంగా ఆవిష్కరించుకునే అంశాలను మీతో నేను చర్చించాలి. దీనికి మీ స్పందన కోసం వేచి ఉంటాను’ అంటూ బీ నర్సింగరావు తన లేఖను ముగించారు.