Thaneeru Harish Rao: అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తాము ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటామని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకుడు, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. రైతు బంధును ఎప్పుడు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.
Rythu Bandhu Scheme: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకుడు, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కొత్తగా ఏర్పాటైన ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారుకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగా ఎన్నికైన సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. ఈ క్రమంలోనే మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ప్రజల తరఫున మాట్లాడుతున్నామనీ, రైతు బంధును ఎప్పుడు ఇస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇచ్చిన పలు హామీలను ప్రస్తావించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా.. వడ్లు అమ్ముకోవద్దు మేము అధికారంలోకి వస్తున్నాము.. రాగానే 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు. ప్రతి క్వింటాలుకు 500 రూపాయలు అదనంగా ఇస్తామన్నారు. ఒకవైపు తుఫాను ప్రభావం వల్ల వర్షం వచ్చి వడ్లు తడిసి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం కొనుగోలు ఎప్పటినుంచి ప్రారంభిస్తారో చెప్పాలనీ, తాము తెలంగాణ రైతాంగం పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పష్టత అడుగుతున్నామని హరీశ్ రావు అన్నారు.
undefined
Read More: సీఎం రేవంత్ రెడ్డి ప్రజా దర్బారుపై ప్రజల అసంతృప్తి.. ఏం జరిగింది అసలు?
అలాగే, రైతు బంధు గురించి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. "ఎన్నికల ప్రచారంలో రైతుబంధు విషయంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము అధికారంలోకి వస్తే రైతుబంధు 15 వేల రూపాయలు ఇస్తామన్నారు. కేసీఆర్ అధికారంలోకి వస్తే రైతుబంధు 10,000 వస్తాయి.. రైతులకు నష్టమవుతుందని కాంగ్రెస్ నాయకులు అన్నారని గుర్తు చేశారు. డిసెంబర్ 9వ తేదీన 15000 రూపాయలు చొప్పున రైతుబంధు డబ్బులు వేస్తామని ఆరోజు ఎన్నికల ప్రచారంలో చెప్పారు.. మరి కొన్ని చోట్ల ఇప్పటికే రాష్ట్రంలో యాసంగి పంట పనులు ప్రారంభమయ్యాయి. గత 7-8 ఏళ్ళుగా తాము రైతుబంధు ఎప్పుడు వేసిన కూడా నవంబర్ చివరి లేదా డిసెంబర్ మొదటి వారంలో యాసంగి పంట రైతుబంధు డబ్బులు కేసీఆర్ ఇచ్చారన్నారు.
అయితే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం డిసెంబర్ 9వ తేదీన 15 వేల రూపాయలు చొప్పున రైతుబంధు డబ్బులు వేస్తామన్నారు.. అయితే, ఇంకా రైతు బంధు పైసలు రైతులకు చేరలేదు. దీనిపై ఇంకా ప్రభుత్వం ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదని పేర్కొన్నారు. "15000 రూపాయలు చొప్పున అంటే యాసంగి పంటకు ఎకరానికి ₹7500 చొప్పున రైతులకు డబ్బులు ఇవ్వాలి. మీరు ప్రజలకు మాట ఇచ్చారు. డిసెంబర్ 9వ తేదీన 15000 చొప్పున రైతుబంధు డబ్బులు బ్యాంకుల్లో వేస్తామని ప్రజలకు మాటిచ్చారు. దీని కోసం రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారని" అన్నారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా రైతుబంధు డబ్బులు ఎప్పటి నుంచి వేస్తారో చెప్పండి. రైతులకు స్పష్టత ఇవ్వాలని తెలంగాణ రైతాంగం పక్షాన తాను ప్రభుత్వాన్ని అడుగుతున్నానని చెప్పారు.
Read More: UPI యూజర్లకు గుడ్ న్యూస్.. చెల్లింపులపై ఆర్బీఐ కీలక నిర్ణయం